ఖమ్మం జిల్లాలో పట్టపగలే చోటుచేసుకున్న ఓ విచిత్ర చోరీ స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. తాళం వేసి ఉన్న ఇంటిని లక్ష్యంగా చేసుకున్న దుండగులు, కేవలం నగలు, నగదు మాత్రమే కాకుండా ఇంట్లో ఉన్న నిత్యావసర వస్తువులను కూడా ఎత్తుకెళ్లడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పెనుబల్లి మండలం లంకపల్లి గ్రామంలో హైవే పక్కనే జరిగిన ఈ ఘటన గ్రామస్తుల్లో భయాందోళనలను పెంచింది.
వివరాల ప్రకారం.. లంకపల్లి గ్రామంలో మసీదు ఆవరణలో నివసిస్తున్న కమాలుద్దీన్ అనే వ్యక్తి అక్కడ మౌజమ్గా పనిచేస్తున్నాడు. ఆయన తన భార్యతో కలిసి అదే ప్రాంగణంలో నివాసం ఉంటున్నారు. శుక్రవారం మధ్యాహ్న సమయంలో ఇద్దరూ బయటకు వెళ్లిన సందర్భాన్ని గమనించిన గుర్తు తెలియని దుండగులు ఇంటి తాళం పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. ముందుగా బీరువాను లక్ష్యంగా చేసుకున్న వారు, అందులో దాచిన సుమారు రూ.1.50 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, రూ.10,000 నగదు, వెండి వస్తువులను అపహరించారు.
అయితే దొంగల దుశ్చర్య అక్కడితో ఆగలేదు. ఇంట్లోని వంటగదిలోకి వెళ్లి అక్కడ ఉన్న ఉల్లిగడ్డలు, కందిపప్పు, వంటనూనె వంటి నిత్యావసర వస్తువులను కూడా ఎత్తుకెళ్లారు. అంతేకాకుండా గ్యాస్ సిలిండర్ను సైతం వదలకుండా తీసుకెళ్లడం ఈ చోరీని మరింత విచిత్రంగా మార్చింది. మధ్యాహ్నం ఇంటికి తిరిగి వచ్చిన దంపతులు ఇంట్లోని పరిస్థితిని చూసి షాక్కు గురయ్యారు. నగలు, నగదు మాత్రమే కాకుండా వంటింటి సామాగ్రి కూడా లేకపోవడం చూసి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పెనుబల్లి పోలీసులు వెంటనే స్పందించారు. సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి క్లూస్ టీమ్ సహాయంతో దుండగుల కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. పట్టపగలే, అది కూడా హైవే సమీపంలో ఇలాంటి చోరీ జరగడం గ్రామస్తుల్లో భయాన్ని పెంచుతోంది. భద్రతా చర్యలను కట్టుదిట్టం చేయాలని స్థానికులు కోరుతున్నారు.
ALSO READ: మళ్లీ ఊపందుకున్న ఓలా షేర్లు.. కారణం ఏంటంటే?
