
Big shock: తెలంగాణలో రేషన్ కార్డుల దుర్వినియోగంపై కేంద్రం తాజాగా కీలక గణాంకాలను బయటపెట్టింది. పేదలకు ఆహార భద్రతను అందించేందుకు, ప్రభుత్వ పథకాలకు అర్హులను గుర్తించేందుకు ఉపయోగించే రేషన్ కార్డు వ్యవస్థ, కాలక్రమంలో అసలు లక్ష్యం నుంచి చాలా మారిపోయిందనే విమర్శలు చాలాకాలంగా వినిపిస్తున్నాయి. ఆర్థికంగా బాగున్నా కూడా పలువురు లబ్ధులు పొందేవారి జాబితాలో చేరేందుకు రేషన్ కార్డులను తీసుకుంటున్నారు. ఈ ప్రక్రియలో అధికారులు కూడా అక్రమాలకు పాల్పడుతూ లంచాలు తీసుకుని అర్హతలేని వారికి కూడా రేషన్ కార్డులు మంజూరు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో కేంద్రం తాజాగా వెల్లడించిన గణాంకాలు రాష్ట్రంలో రేషన్ కార్డులపై అమలవుతున్న జాగ్రత్తల స్థాయిని మరోసారి స్పష్టంచేశాయి. గడిచిన 10 నెలల్లో ఒక్క తెలంగాణలోనే 1,40,947 రేషన్ కార్డులు రద్దు చేసినట్లు కేంద్రం ప్రకటించింది. ఇది 2020 తర్వాత ఏకంగా అత్యధిక సంఖ్య. అంటే ఈ ఏడాదిలో అనర్హులపై కఠిన చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. బుధవారం లోక్‌సభ సమావేశంలో ఎంపీలు రామసహాయం రఘురాం రెడ్డి, తదితరులు అడిగిన ప్రశ్నలకు కేంద్ర మంత్రి నిముబెన్ జయంతిభాయి బంభానియా లిఖితపూర్వక సమాధానమిచ్చారు.
గత అయిదేళ్ల గణాంకాలను పరిశీలించినప్పుడు కూడా ఈ సంఖ్య చాలా స్పష్టంగా కనిపిస్తుంది. 2020లో 1,254 రేషన్ కార్డులు రద్దు చేయగా, 2022లో 4,988, 2023లో 34,064, 2024లో 3,424 రద్దులు జరిగాయి. అయితే 2025లో అక్టోబర్ వరకు మాత్రమే 1.40 లక్షల పైగా రద్దులు జరగడం ఈసారి ప్రత్యేకతగా కనిపిస్తోంది. దీంతో అక్రమాలు, అర్హతలేని వారి జాబితా ఎంతగా పెరిగిందో అర్థమవుతోంది. ఆసక్తికర విషయం ఏమిటంటే.. ఈ రద్దుల నేపథ్యంలో కేంద్రానికి ఎలాంటి ఫిర్యాదులు అందలేదని మంత్రి తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో మొత్తం 56,60,367 రేషన్ కార్డులు అమల్లో ఉన్నాయి.
మరోవైపు, రేషన్ షాపుల వ్యవస్థపై కూడా కేంద్రం ఓ కీలక స్పష్టత ఇచ్చింది. భారత ఆహార భద్రతా చట్టం 2006 ప్రకారం రేషన్ షాపులు కూడా ఆహార వ్యాపార కార్యకలాపాల పరిధిలోకి వస్తాయని, అందువల్ల దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి రేషన్ షాపు యజమాని తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ లేదా లైసెన్స్ తీసుకోవాలని స్పష్టం చేసింది. లోక్‌సభలో ఎంపీ కడియం కావ్య అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి బి.ఎల్. వర్మ లిఖిత సమాధానం ఇచ్చారు.
రేషన్ షాపులలో పరిశుభ్రత, ఆహార పదార్థాల నాణ్యత పట్ల రాజీపడే అవకాశం లేదని, అందుకోసం ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ క్రమం తప్పకుండా తనిఖీలు చేస్తుందని కేంద్రం తెలిపింది. నాణ్యత లోపించిన చోట్ల ఫుడ్ బిజినెస్ ఆపరేటర్‌లపై చట్టపరమైన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. దేశవ్యాప్తంగా 38 రకాల ముఖ్య ఆహార వస్తువుల ధరలను 575 కేంద్రాలు నిరంతరాయంగా పర్యవేక్షిస్తున్నాయని, మొబైల్ యాప్ ద్వారా ఈ డేటా సేకరణ జరుగుతోందని వివరించారు.
రేషన్ కార్డుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం మరింత కఠిన ధోరణికి మారింది. అలాగే రేషన్ షాపుల నిర్వహణలో నాణ్యత, పారదర్శకతకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తోంది. ఈ చర్యలతో కేంద్రం లక్ష్యం పేదలకే నిజమైన లబ్ధి చేరడం, నాణ్యమైన ఆహార భద్రతను అందించడం స్పష్టంగా కనిపిస్తోంది.
ALSO READ: Gold Rate: మరోసారి భారీగా పెరిగిన ధరలు





