తెలంగాణ

కేసీ వేణుగోపాల్‌తో భట్టి మీటింగ్.. రేవంత్ శిబిరంలో టెన్షన్!

తెలంగాణ కాంగ్రెస్ లో సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి.పార్టీ రేవంత్ వర్గం.. రేవంత్ రెడ్డి వ్యతిరేక వర్గంగా చీలిపోయినట్లు కనిపిస్తోంది. సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇటీవల చేసిన కామెంట్లు గాంధీభవన్ లో కాక రేపుతున్నాయి. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పాటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి లేఖ రాశారు జీవన్ రెడ్డి. గాంధీభవన్ వేదికగానే సీఎం రేవంత్ రెడ్డి తీరును ఎండగట్టారు జీవన్ రెడ్డి. పార్టీలో మొదటి నుంచి ఉన్న లీడర్లను తొక్కేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా గెలిచి కాంగ్రెస్ కండువా కప్పుకున్న మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. గతంలో టీడీపీలో పని చేసిన నేతలే ప్రస్తుతం ప్రభుత్వంలో చక్రం తిప్పుతున్నారనే కోణంలో ఆరోపణలు చేశారు. జీవన్ రెడ్డి మాటలకు కొందరు సీనియర్ నేతలు మద్దతు ఇచ్చారనే టాక్ కాంగ్రెస్ వర్గాల్లో సాగుతోంది.

జీవన్ రెడ్డి పార్టీ పెద్దలకు లేఖ రాసిన కొన్ని గంటల్లోనే ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఢిల్లీకి వెళ్లారు. నిజానికి ఢిల్లీ టూర్ ఆయన షెడ్యూల్ లో లేదు. కాని సడెన్ గా ఆయన హస్తినలో ప్రత్యక్షం కావడం చర్చగా మారింది. రాహుల్ గాంధీ సన్నిహితుడు కేసీ వేణుగోపాల్ తో భట్టి సమావేశమయ్యారు. ఇదే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో హాట్ టాపిక్ గా మారింది. రెండు రోజుల క్రితం ప్రియాంక గాంధీ నామినేషన్ కార్యక్రమానికి వయనాడ్ వెళ్లారు భట్టి విక్రమార్క. అక్కడే రాహుల్ తో పాటు కేసీ వేణుగోపాల్ ను కలిశారు. అయినా రెండు రోజుల వ్యవధిలోనే భట్టి విక్రమార్క ఢిల్లీకి వెళ్లడం.. కేసీ వేణుగోపాల్ తో సమావేశం కావడం అనేక గుసగుసలకు తావిస్తోంది.

తెలంగాణ కాంగ్రెస్ లో ఇటీవల వరుసగా వివాదాస్పద ఘటనలు జరుగుతున్నాయి. మంత్రి కొండా సురేఖ హీరో నాగార్జునపై చేసిన కామెంట్లు జాతీయ స్థాయిలో పార్టీకి ఇబ్బందిగా మారాయి. వరంగల్ జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా కొండా సురేఖకు వ్యతిరేకంగా పార్టీ హైకమాండ్ కు లేఖ రాశారు. ప్రభుత్వ పరంగా తీసుకున్న నిర్ణయాలు పార్టీకి చెడ్డపేరు తెచ్చాయనే టాక్ వస్తోంది. హైడ్రా కూల్చివేతలు, గ్రూప్ 1 వివాదంతో కాంగ్రెస్ పట్ల ప్రజలకు వ్యతిరేకత పెరిగిందనే చర్చ గాంధీభవన్ లోనే సాగుతోంది. రైతు రుణమాఫీ చేశామని ముఖ్యమంత్రి చెబుతున్నా.. ఇంకా 20 లక్షల మందికి మాఫీ కాలేదని వ్యవశాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావే ప్రకటించారు. ఇది కూడా గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ కు మైనస్ గా మారిందంటున్నారు. ఇక జిల్లాలోనూ పార్టీలో వర్గపోరు పెరిగిపోతోంది. ఇవన్ని విషయాలపై పార్టీ పెద్దలు అసంతృప్తిగా ఉన్నారని అంటున్నారు.

సీఎం రేవంత్ రెడ్డి బ్రదర్స్ పై వస్తున్న అవినీతి ఆరోపణలకు సంబంధించిన వివరాలు కూడా ఎప్పటికప్పుడు ఢిల్లీకి వెళుతున్నాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భట్టి విక్రమార్కను హైకమాండ్ నేతలే పిలుపించుకుని.. తెలంగాణలో అసలు ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నాలు చేశారంటున్నారు. మొత్తంగా భట్టి విక్రమార్క హస్తిన పర్యటన హస్తం పార్టీలో సెగులు రేపుతోందని అంటున్నారు.

Read More News :

  1. రేవంత్ రెడ్డిపై పొంగులేటి బాంబ్ వేస్తాడేమో.. కేటీఆర్ సంచలన కామెంట్స్
  2. జగన్ సార్.. ఈ ఆస్తుల సంగతేంటీ.. 10 ప్రశ్నలతో షర్మిల ఘాటు లేఖ
  3. తెలంగాణ టీడీపీ చీఫ్‌గా తీగల కృష్ణారెడ్డి!
  4. YSR కుటుంబంలో కల్లోలం.. విజయమ్మ, షర్మిలను కోర్టుకు లాగిన జగన్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button