తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు అగ్ర కథానాయికగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటి ఆమని ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక గుర్తింపుతో నిలిచారు. గ్లామర్ ప్రదర్శనకు దూరంగా ఉంటూనే చీరకట్టులో సాంప్రదాయబద్ధమైన పాత్రలతో అభిమానులను ఆకట్టుకున్న ఆమె.. కుటుంబ కథా చిత్రాలతో పాటు భావోద్వేగాలకు ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో నటించి తనదైన ముద్ర వేశారు. ప్రస్తుతం వెండితెరపై సహాయ పాత్రల్లో, బుల్లితెరపై పలు ధారావాహికల్లో నటిస్తూ తన ప్రయాణాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నారు. ఇటీవల ఆమె తన వ్యక్తిగత జీవితం, ఆరోగ్య రహస్యాలు, ఆధ్యాత్మికత, సినీ జీవితంలో నేర్చుకున్న విలువలు, రాబోయే చిత్రాల గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
తన సినీ ప్రయాణం ప్రారంభ దశలో దర్శకుడు ఈవివి సత్యనారాయణ నుంచి ఎంతో నేర్చుకున్నానని ఆమని తెలిపారు. నటన మాత్రమే కాకుండా ఒక కళాకారిణి జీవితంలో క్రమశిక్షణ ఎంత ముఖ్యమో ఆయన తనకు వివరించారని చెప్పారు. చర్మ సంరక్షణ, సరైన నిద్ర, వ్యక్తిత్వ వికాసం, వృత్తిపరమైన బాధ్యతల గురించి ఈవివి సత్యనారాయణ ఇచ్చిన సూచనలు ఇప్పటికీ తన జీవితంలో మార్గదర్శకంగా నిలిచాయని ఆమె వెల్లడించారు. ప్రారంభ దశలో అవకాశాల కోసం ఎదురు చూస్తూ ప్రొడక్షన్ సంస్థలపై ఆధారపడకుండా, తన ప్రతిభతో ఒక స్థాయి సాధిస్తే అన్ని అవకాశాలు స్వయంగా వస్తాయని ఆయన చెప్పిన మాటలు జీవితాంతం గుర్తుండిపోయాయని తెలిపారు.
ఆరోగ్య పరిరక్షణ విషయంలో తాను ఎప్పటి నుంచో క్రమబద్ధమైన జీవనశైలిని అనుసరిస్తున్నానని ఆమని చెప్పారు. చిన్ననాటి నుంచే ఆరోగ్యకరమైన అలవాట్లు అలవడటంతో ఫిట్‌గా ఉండగలుగుతున్నానని తెలిపారు. తాను సన్నగా కనిపించినప్పటికీ ఆహారాన్ని మానేయడం లేదా కఠిన నియమాలు పాటించడం చేయనని, అన్ని రకాల ఆహారాలను పరిమిత మోతాదులో తీసుకోవడమే తన ఆరోగ్యానికి ప్రధాన కారణమని వివరించారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం తప్పకుండా తీసుకుంటానని, కేవలం పరిమితి పాటించడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నానని వెల్లడించారు.
ఆమని జీవితంలో ఆధ్యాత్మికతకు కూడా ప్రత్యేక స్థానం ఉంది. ప్రతి రోజు ఉదయం 4 గంటలకు నిద్రలేచి స్నానం చేసిన అనంతరం లలితా సహస్రనామం లేదా విష్ణు సహస్రనామం పఠిస్తూ పూజ నిర్వహిస్తానని చెప్పారు. ఇంట్లో దీపారాధన చేయకుండా బయటకు వెళ్లే అలవాటు తనకు లేదని తెలిపారు. మానసిక ప్రశాంతతకు భక్తి ఎంత అవసరమో, శారీరక ఆరోగ్యానికి యోగా, వ్యాయామం కూడా అంతే అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు. కుటుంబంతో గడపడం, పని పట్ల నిబద్ధతతో ఉండడం తనకు ఆనందాన్ని ఇస్తాయని, పబ్బులు, పార్టీల వంటి వాటికి దూరంగా ఉంటానని పేర్కొన్నారు.
వ్యక్తిగత ఆహార అలవాట్ల గురించి మాట్లాడుతూ.. తాను పూర్తిగా శాకాహార జీవనశైలినే అనుసరిస్తున్నానని చెప్పారు. విశ్వబ్రాహ్మిణ్ కుటుంబంలో జన్మించిన కారణంగా చిన్నప్పటి నుంచే శాకాహారమే అలవాటైందని తెలిపారు. తన తల్లి కూడా మాంసాహారం తీసుకోకపోవడంతో చిన్ననాటి నుంచే మాంసాహారంపై ఆసక్తి కలగలేదని చెప్పారు. అయితే కుటుంబ సభ్యుల కోసం ఎంతో రుచికరంగా మాంసాహార వంటకాలు, బిర్యానీలు తయారు చేస్తానని, కానీ తాను మాత్రం వాటిని తిననని వెల్లడించారు. ఈ ఆహార విధానం జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుందని ఆమె అభిప్రాయపడ్డారు.
సినీ జీవితంలో విజయానికి క్రమశిక్షణే ప్రధాన కారణమని ఆమని నమ్ముతారు. రాత్రిళ్లు త్వరగా నిద్రపోవడం, ఉదయాన్నే లేవడం వల్ల శరీరానికి సరైన విశ్రాంతి లభిస్తుందని, అది ముఖంపై సహజ కాంతిని నిలబెడుతుందని తెలిపారు. ఎన్నో సంవత్సరాల క్రితం విడుదలైన ‘మిస్టర్ పెళ్ళాం’, ‘శుభ సంకల్పం’ వంటి చిత్రాలు తనకు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చాయని గుర్తు చేసుకున్నారు. ప్రేక్షకుల ప్రేమ, ఆదరణ వల్లే ఇప్పటికీ నటిగా కొనసాగుతున్నానని పేర్కొన్న ఆమని, ప్రస్తుతం బుల్లితెరతో పాటు వెండితెరపై కూడా బిజీగా కొనసాగుతున్నారు.
ALSO READ: పోలీస్ ఉద్యోగానికి ఎసరుపెట్టిన చికెన్