Homeఆంధ్ర ప్రదేశ్అమరావతికి రాజముద్ర...!

అమరావతికి రాజముద్ర…!

  • కదిలించలేని శక్తిగా మార్చేసిన చంద్రబాబు

  • కేంద్రంతో పాటు అన్ని రాజకీయ పార్టీలకు భాగస్వామ్యం

  • భవిష్యత్తులో రాజధాని మార్పు దాదాపు అసాధ్యం

  • జగన్ సైలెన్స్ పాటిస్తేనే ఉత్తమ మంటున్న విశ్లేషకులు

క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: ఏపీలో ఇక అమరావతి ఏకైక రాజధాని. అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం లభించింది. దీంతో కేంద్ర న్యాయశాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సబ్ సెక్షన్ 2లో రాజధానిగా అమరావతిని పేర్కొంటూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. 2024 జూన్ రెండు నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. దీంతో అమరావతి ఒక శక్తివంతమైన రాజధానిగా అవతరించింది అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ముగిసిన ఉమ్మడి రాజధాని గడువు..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో ఆ మూడు రాజధానులకు న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యాయి. దీంతో ఆ బిల్లును వెనక్కి తీసుకుంది వైసిపి ప్రభుత్వం. మరోవైపు రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కొనసాగింది. విభజన చట్టంలో పదేళ్లపాటు ఉమ్మడి రాజధాని అని పేర్కొన్నారు. అందుకు సంబంధించిన గడువు జూన్ 2, 2024తో ముగిసింది. అందుకే ఇప్పుడు అమరావతికి ప్రత్యేకంగా నోటిఫై చేయాల్సిన అనివార్య పరిస్థితి ఎదురైంది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి వేరకు కేంద్ర ప్రభుత్వం దీనిపై స్పందించింది. అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంట్ ఉభయ సభల్లో బిల్లు ప్రవేశపెట్టింది. లోక్ సభ తో పాటు రాజ్యసభలో ఈ బిల్లు ఆమోదం పొంది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వద్దకు వెళ్ళింది. ఆమె న్యాయ నిపుణులతో సంప్రదించి దానిపై సంతకం చేశారు. దీంతో కేంద్ర న్యాయశాఖ అమరావతి ఏకైక రాజధానిగా పేర్కొంటూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు.

ఇక కేంద్రం నుంచి నేరుగా నిధులు..
కేవలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మూడు రాజధానుల అంశానికి భయపడి మాత్రమే అమరావతికి చట్టబద్ధత అని అంతా భావించారు. కానీ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను పేర్కొంటూ 10 ఏళ్లపాటు గడువు విధించిన సంగతి తెలిసిందే.. ఆ గడువు జూన్ 2, 2024 తో ముగిసింది. అందుకే అమరావతిని ప్రత్యేకంగా నోటిఫై చేయాల్సిన అనివార్య పరిస్థితి ఎదురైంది. అయితే ఈ పరిణామం వెనుక కేవలం జగన్మోహన్ రెడ్డిని అడ్డుకోవడం అనేది మాత్రమే కాదు. అంతకంటే లోతైన ఆర్థిక, చట్టపరమైన వ్యూహాలు ఉన్నాయి. ఈ చట్టబద్ధతతో అమరావతికి కేంద్ర ప్రభుత్వ సాయం, నిధుల విడుదల వంటి వాటికి మార్గం సుగమం కానుంది. గతంలో కేవలం రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే అమరావతి రాజధానిగా నోటిఫై చేసింది. ఇప్పుడు పార్లమెంట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2026 అమలులోకి వచ్చింది. తద్వారా కేంద్ర ప్రభుత్వ నిధులను నేరుగా పొందే హక్కు లభించింది. ఇప్పటికే వార్షిక బడ్జెట్లో 15 వేల కోట్ల రూపాయలను సర్దుబాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. వరల్డ్ బ్యాంక్ తో పాటు ఏసియన్ డెవలప్మెంట్ బ్యాంకు ద్వారా ఈ నిధులు సర్దుబాటు చేయగలిగింది. ఇంకా మరో పదకొండు వేల కోట్ల రూపాయల వరకు వివిధ మార్గాల్లో సర్దుబాటు చేసింది. ఇప్పుడు కేంద్రమే నోటిఫై చేయడం ద్వారా నిధులకు బలమైన షూరిటీగా కేంద్రం ఉండనుంది.

జగన్ కు డ్యామేజ్
ఇకనుంచి రాజధానుల మార్పు అంటే కుదరని పని. అయినా సరే జగన్మోహన్ రెడ్డి చాలా తేలిగ్గా మాట్లాడుతున్నారు. తనను తాను సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారు. ఎందుకంటే రాజధానుల విషయంలోనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి భారీ డ్యామేజ్ జరిగింది. అయినా గుణపాటాలు నేర్చుకోవడం లేదు. రాజధాని అనేది ఒక్క కార్యాలయం అనుకుంటే పొరపడినట్టే. అది ఒక వ్యవస్థ అన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. పార్లమెంటు ఒకసారి రాజధానిని నోటిఫై చేసిన తర్వాత దానిని మార్చడం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో దాదాపు అసాధ్యం. ఒకవేళ మార్చాలనుకున్న మళ్లీ పార్లమెంట్ ఆమోదం కావాలి. అది ప్రస్తుత రాజకీయ సమీకరణల్లో అంత సులువు కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి రాజకీయ అస్థిరత కల్పించాలన్న ఉద్దేశంతోనే అటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఎంత సైలెన్స్ పాటిస్తే అంత మంచిది అని కూడా చెబుతున్నారు.

ఇక పెట్టుబడుల వరద..
అయితే కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధత కల్పించడంతో అమరావతికి పెట్టుబడులు పెట్టేవారు వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. ఎందుకంటే ప్రైవేట్ ఇన్వెస్టర్లలో ఉన్న సందిగ్ధత పూర్తిగా తొలగింది.. 2019లో అధికారంలోకి వచ్చిన వైయస్సార్ కాంగ్రెస్ అమరావతి రాజధానిని నిర్వీర్యం చేసింది. దానికి ఉన్న బ్రాండ్ పూర్తిగా దెబ్బతింది. కానీ ఇప్పుడు పార్లమెంట్ ఆమోదంతో పెట్టిన ప్రతి పైసాకు చట్టపరమైన రక్షణ లభిస్తుందని పారిశ్రామికవేత్తలకు తెలుసు. ప్రస్తుతం అమరావతిలో 56 వేల కోట్ల విలువైన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సింగపూర్ సంస్థలతో కుదుర్చుకున్న పాత ఒప్పందాలు మళ్లీ పట్టాలెక్కే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు చట్టబద్ధతతో చాలా సంస్థలు తమ ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభించే ఛాన్స్ కనిపిస్తోంది. అమరావతికి చట్టబద్ధత అనేది ఒక రాజముద్ర. అది చెరిపేసే పరిస్థితి లేదు. అంత బలంగా దానిని రూపొందించారు సీఎం చంద్రబాబు. ఏకంగా కేంద్ర ప్రభుత్వానికి, జాతీయస్థాయిలో అన్ని రాజకీయ పార్టీలను ఇందులో భాగస్వామ్యం చేయడం ద్వారా.. అమరావతిని కదిలించలేని శక్తిగా మార్చేశారు. జగన్ చెబుతున్నవన్నీ తాత్కాలిక మాటలే కానీ.. అమరావతిని కదిలించే మంత్రదండం ఎవరి వద్ద లేదు అని ఆయనకు తెలుసు. కేవలం రాజకీయ మేకపోతు గాంబీర్యంలో భాగంగా ఆ వ్యాఖ్యలు చేస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు