అంతర్జాతీయం

అమెరికాలోని భారతీయులకు గండం! నేడే ట్రంప్ ప్రమాణం

అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్ధమైంది. వాషింగ్టన్ డీసీలో ఉన్న క్యాపిటల్‌ హిల్‌లోని రోటుండా ఇండోర్ ఆవరణలో ట్రంప్​ ప్రమాణం చేయనున్నారు. భారత్‌ కాలమానం ప్రకారం రాత్రి 10.30 గంటలకు ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది. ట్రంప్‌ ఇప్పటికే తన కుటుంబంతో కలిసి ఫ్లోరిడా నుంచి వాషింగ్టన్‌ చేరుకున్నారు. అక్కడ 100 మంది ప్రముఖులకు పార్టీ ఇచ్చారు. ఆ పార్టీలో భారతదేశానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్ ముకేశ్ అంబానీ దంపతులు పాల్గొన్నారు.

సాధారణంగా క్యాపిటల్‌ భవనం మెట్లపై అధ్యక్షులుగా ప్రమాణం చేస్తుంటారు. అయితే అతిశీతల వాతావరణం కారణంగా బహిరంగ ప్రదేశంలో కాకుండా ఇండోర్ ఆవరణలో ట్రంప్ ప్రమాణం చేయనున్నారు. ఆ ప్రాంతాన్ని సర్వంగా సుందరంగా తీర్చిదిద్దారు. దాదాపు 25వేల మందితో ఫెడరల్ అధికారులు భద్రత ఏర్పాట్లు చేశారు. తొలుత సెయింట్‌ జాన్స్‌ ఎపిస్కోపల్‌ చర్చిలో ట్రంప్‌ ప్రార్థనలు చేస్తారు. అక్కడి నుంచి వైట్‌ హౌస్‌కు వెళ్లి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్, ఆయన సతీమణి ఇచ్చే టీ పార్టీలో పాల్గొంటారు.

అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ట్రంప్‌తో అధ్యక్షుడిగా ప్రమాణం చేయిస్తారు. ప్రమాణం చేశాక ట్రంప్‌ ప్రారంభోపన్యాసం చేస్తారు. అమెరికా యూనిటీ థీమ్‌గా ఆ ఉపన్యాసం ఉంటుందని ట్రంప్ ఇప్పటికే స్పష్టత ఇచ్చారు. మొదటి రోజే పాలనపై తన ముద్ర స్పష్టంగా కనిపించాలని ట్రంప్‌ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సుమారు 100 కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకాలు చేయనున్నారు. ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన వాగ్దానాల మేరకు ట్రంప్‌ ఈ సంతకాలు చేయనున్నారు. వాటిలో ముఖ్యంగా ఏడు అంశాలు ఉంటాయని తెలుస్తోంది. అమెరికా దక్షిణ సరిహద్దులు మూసివేయడం, వలసదారుల డిపోర్టేషన్​, ట్రాన్స్​జెండర్ల హక్కులు కాలరాయడం, చమురు వెలికితీత పెంచడం, ప్రభుత్వ సామర్థ్యాన్ని మెరుగుపరచడం, క్షమాభిక్షలు వంటి కార్యక్రమాలను తొలి రోజే మొదలుపెట్టాలని ట్రంప్ ప్లాన్‌ చేస్తున్నారని సమాచారం.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button