
AP Amaravati : ఏపీ రాజధాని అమరావతి క్యాపిటల్ సిటీగా రూపుదిద్దుకోబోతోంది. అమరావతి నిర్మాణంపై ఫోకస్ పెట్టిన చంద్రబాబు ప్రభుత్వం… వడివడిగా అడుగులు వేస్తోంది. అమరావతి రీలాంచ్‌కు రెడీ అవుతోంది. ప్రధాని మోడీ చేతుల మీదుగా.. అమరావతి పునర్‌నిర్మాణానికి శ్రీకారం చుట్టబోతున్నామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. మూడేళ్లలో.. రాజధానికి రూపురేఖలు తీసుకొచ్చేలా పనులు మొదలుపెట్టబోతున్నారు.
రాష్ట్ర విభజన జరిగిన తర్వాత.. ఏపీలో ఏర్పడిన టీడీపీ ప్రభుత్వం.. అమరావతిని రాష్ట్ర రాజధానిగా ఎంపిక చేసింది. ప్రధాని మోడీని పిలిపించి అట్టహాసంగా… శంకుస్థాపన కూడా చేయించారు సీఎం చంద్రబాబు. అయితే.. అప్పుడు కేంద్రం నుంచి సరిగా సహకారం లేదు. అయినా.. కొన్ని భవనాలకు పునాదులు వేసింది అప్పటి టీడీపీ ప్రభుత్వం. తాత్కాలిక అసెంబ్లీ, హైకోర్డు భవనాలను కూడా నిర్మించింది. కానీ అందులోని నాణ్యతా లోపం… నాటి టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకతను తెచ్చిపెట్టాయి. పైగా అమరావతి నిర్మాణానికి 3వేల ఎకరాల భూములు సేకరించడం కూడా వివాదాస్పదమైంది. రాజధాని నిర్మాణానికి లక్ష కోట్ల రూపాయలు ఖర్చవుతుందని.. అంత డబ్బు పెట్టాలంటే రాష్ట్రానికి పెనుభారమన్న వాదన కూడా వినిపించింది. ఒక్క అమరావతిపై అంత ఖర్చు పెడితే.. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల పరిస్థితి ఏంటి..? అన్న ప్రశ్న కూడా మొదలైంది. అయినా… ఆనాటి సీఎం చంద్రబాబు అమరావతిపై ఫోకస్ పెట్టారు. రాజధాని ప్రాంతంలో భవనాలు పునాదుల దశలో ఉండగా… 2019 ఎన్నికలు వచ్చాయి. వైసీపీ విజయం సాధించింది. ఆ తర్వాత అమరావతిలో రాజధాని నిర్మాణానికి లక్ష కోట్ల బడ్జెట్ పెట్టలేక పక్కన పెట్టేసింది. మూడు రాజధానుల అంశం తెరపైకి తెచ్చింది. విశాఖను ఎక్స్‌క్యూటివ్ కాపిటల్‌గా చేస్తే… పెద్ద ఖర్చు ఉండదని… అలాగే అమరావతి శాసన రాజధానిగా… కర్నూలు న్యాయ రాజధానిగా చేయాలని నిర్ణయించింది. కానీ.. అది కార్యరూపం దాల్చలేదు. అలా.. ఇంకో ఐదేళ్లు గడిపోయాయి. రాష్ట్రం విడిపోయి పదేళ్లు దాటిన.. ఏపీకి రాజధాని లేకుండా పోయింది. విభజన సమయంలో పదేళ్లు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ప్రకటించారు. పదేళ్లు గడిచిపోవడంతో… ఇప్పుడు అది కూడా లేదు.
2024 ఎన్నికల్లో భారీ మెజార్టీ, అత్యధిక సీట్లతో అధికారంలోకి వచ్చింది టీడీపీ-జనసేన-బీజేపీ NDA కూటమి. అధికారంలో బీజేపీకి కూడా భాగస్వామ్యం ఉండటంతో.. అమరావతికి ఫుల్‌గా సపోర్ట్ చేస్తోంది. ఆర్ధిక సాయం చేస్తామని కూడా చెప్తోంది. దీంతో… సీఎం చంద్రబాబు అమరావతిపై మళ్లీ ఫోకస్ పెంచారు. అధికారంలోకి రావడంతోనే…. అమరావతి పునర్‌నిర్మాణం దిశగా చర్యలు చేపడుతున్నారు. మరో మూడేళ్లలో రాజధానికి ఒక రూపం తెస్తామని చెప్తున్నారు. అమరావతిని ప్రధాని మోడీ చేతుల మీదుగా త్వరలోనే రీలాంచ్ చేస్తామని అన్నారు. అంతేకాదు… భారీ పెట్టుబడులు కూడా తీసుకొస్తామని హామీ ఇస్తున్నారు. ఇది ఎంత వరకు సాధ్యమవుతుంది…? అమరావతిలో భవనాల నిర్మాణం జరిగినా… పూర్తిస్థాయి రాజధానిగా అభివృద్ధి చెందడానికి ఎన్నేళ్లు పడతాయో..?