Aircraft: రాయలసీమ ముఖచిత్రం పూర్తిగా మారిపోనుందా?

Aircraft: ఇన్నాళ్లూ కరువుతో, వెనుకబాటుతనంతో గుర్తింపు పొందిన రాయలసీమ ప్రాంతం ఇప్పుడు పూర్తిగా కొత్త ముఖచిత్రాన్ని సంతరించుకునే దిశగా అడుగులు వేస్తోంది.

Aircraft: ఇన్నాళ్లూ కరువుతో, వెనుకబాటుతనంతో గుర్తింపు పొందిన రాయలసీమ ప్రాంతం ఇప్పుడు పూర్తిగా కొత్త ముఖచిత్రాన్ని సంతరించుకునే దిశగా అడుగులు వేస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో పారిశ్రామిక రంగానికి ఊపిరిపోసేలా వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్రమంలో ఏరోస్పేస్ రంగాన్ని ఆంధ్రప్రదేశ్‌కు రప్పించేందుకు ప్రభుత్వం గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా విమాన తయారీ రంగంలో ప్రపంచ స్థాయి ప్రాజెక్టులు రాయలసీమకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈ ప్రణాళికలో భాగంగా బ్రెజిల్‌కు చెందిన ప్రముఖ విమానయాన సంస్థ ఎంబ్రేయర్, భారతీయ దిగ్గజ సంస్థ అదానీ ఏరోస్పేస్ సంయుక్తంగా చేపట్టనున్న భారీ విమాన తయారీ ప్రాజెక్టును రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. చిన్న, మధ్య తరహా ప్రయాణికుల విమానాల తయారీ లక్ష్యంగా ఈ జాయింట్ వెంచర్ యూనిట్‌ను ఏర్పాటు చేయనుండగా, దీనికి అనువైన ప్రాంతంగా అనంతపురం జిల్లా తెరపైకి వచ్చింది. అయితే ఇదే ప్రాజెక్టును దక్కించుకునేందుకు గుజరాత్ కూడా తీవ్రంగా పోటీ పడుతోంది.

అనంతపురం జిల్లాకు అనుకూలంగా మారిన ప్రధాన అంశం బెంగళూరుకు సమీపం. విమాన తయారీకి అవసరమైన పరిశ్రమలు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, సాంకేతిక ఎకోసిస్టమ్ ఇప్పటికే బెంగళూరులో బలంగా ఉంది. దేవనహళ్లి అంతర్జాతీయ విమానాశ్రయానికి అనంతపురం జిల్లా అత్యంత దగ్గరగా ఉండటం వల్ల లాజిస్టిక్స్, సప్లై చైన్ పరంగా ఏపీకి ఇది పెద్ద ప్లస్ పాయింట్‌గా మారుతోంది. ఈ కారణంతోనే అదానీ-ఎంబ్రేయర్ ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది.

పోటీలో వెనుకబడకుండా ఉండేందుకు భూముల కేటాయింపు, రాయితీలు, మౌలిక వసతుల కల్పన విషయంలో ప్రభుత్వం వేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రధాని సొంత రాష్ట్రం అయిన గుజరాత్ కూడా ఇదే ప్రాజెక్టుపై కన్నేసిన నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ అవకాశాన్ని చేజారనివ్వకుండా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోంది. రాయలసీమను పారిశ్రామిక హబ్‌గా మార్చాలనే దీర్ఘకాలిక లక్ష్యంలో ఇది కీలక అడుగుగా భావిస్తున్నారు.

ఇదే ప్రాంతంలో ఇప్పటికే ఏరోస్పేస్ రంగానికి సంబంధించిన మరో కీలక అడుగు పడింది. బెంగళూరుకు చెందిన సరళ ఏవియేషన్ సంస్థకు అనంతపురం పరిసరాల్లో ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎలక్ట్రికల్ వర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ విమానాల తయారీ కోసం రూ.1300 కోట్ల పెట్టుబడితో ఈ సంస్థ ముందుకు వచ్చింది. 6 సీట్ల సామర్థ్యం గల ఆధునిక విమానాలను తయారు చేసే లక్ష్యంతో 500 ఎకరాల్లో స్కై ఫ్యాక్టరీని అభివృద్ధి చేయనున్నారు.

ఈ స్కై ఫ్యాక్టరీ ప్రాజెక్టుతో పాటు అదే ప్రాంతంలో మిగిలిన భూములను అదానీ-ఎంబ్రేయర్ ప్రాజెక్టుకు కేటాయించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. దీని ద్వారా ఒకే ప్రాంతంలో ఏరోస్పేస్ క్లస్టర్ అభివృద్ధి చేయాలన్నది ప్రభుత్వ వ్యూహంగా కనిపిస్తోంది. ఇది రాయలసీమ ప్రాంతంలో వేలాది ఉద్యోగాలకు, అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు మార్గం సుగమం చేయనుంది.

అనంతపురం వద్ద ప్రాజెక్టు కుదరకపోతే మరో ప్రత్యామ్నాయంగా శ్రీ సత్యసాయి జిల్లాలోని కొడికొండ చెక్‌పోస్టు సమీపంలో భారీ పారిశ్రామిక పార్కు ప్రతిపాదన సిద్ధంగా ఉంది. గతంలో లేపాక్షి నాలెడ్జ్ హబ్ కోసం కేటాయించి, ప్రస్తుతం ఈడీ పరిధిలో ఉన్న 8,844 ఎకరాల భూములను తిరిగి స్వాధీనం చేసుకునే ప్రక్రియ దాదాపు పూర్తి దశకు చేరింది. వీటికి అదనంగా చుట్టుపక్కల మండలాల్లో భూ సేకరణ జరిపి, మొత్తం 20 వేల ఎకరాల్లో మెగా ఇండస్ట్రియల్ పార్కును అభివృద్ధి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం.

ఇదిలా ఉండగా ఉత్తరాంధ్రలో కూడా విమానయాన రంగం కొత్త మైలురాయిని అందుకుంది. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మాణంలో ఉన్న గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలిసారిగా విమానం విజయవంతంగా ల్యాండ్ అయింది. ఢిల్లీ నుంచి వచ్చిన ఎయిరిండియా టెస్ట్ ఫ్లైట్ సురక్షితంగా దిగగా, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ ప్రయోగాత్మక ప్రయాణంలో పాల్గొన్నారు. గంటకు 280 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులను తట్టుకునేలా అత్యాధునిక సాంకేతికతతో ఈ విమానాశ్రయాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే 96 శాతం పనులు పూర్తికాగా, షెడ్యూల్ కంటే ఆరు నెలల ముందే జూన్ 26న విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నట్లు జీఎంఆర్ సంస్థ ప్రకటించింది.

ALSO READ: జస్ట్ వాకింగే కదా అనుకునేరు.. బెస్ట్ ఫ్రెండ్‌తో కలిసి 12 నిమిషాలు వాకింగ్ చేస్తే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button