Affair: రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో కుటుంబ బంధాలను కుదిపేసిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రియుడి మోజులో పడిన భార్య తన భర్తను ప్లాన్ ప్రకారం హత్య చేసిన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులుగా జీవిస్తున్న దంపతుల మధ్య పెరిగిన విభేదాలు చివరకు ప్రాణాంతక పరిణామాలకు దారి తీసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
పోలీసుల వివరాల ప్రకారం.. శంకర్‌పల్లి మండలం పర్వేద గ్రామానికి చెందిన నారగూడం కృష 35, జీడిమెట్లకు చెందిన రాజేశ్వరిని ప్రేమించి 2018లో వివాహం చేసుకున్నాడు. అనంతరం చేవెళ్లలోని చంద్రారెడ్డినగర్ ప్రాంతంలో అద్దె ఇంట్లో నివసిస్తూ ఇద్దరూ కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. జీవితం సాదాసీదాగా సాగుతున్న సమయంలో రాజేశ్వరికి ఖానాపూర్ గ్రామానికి చెందిన శరత్‌తో పరిచయం ఏర్పడింది. అతడు చేవెళ్లలోని గణేష్ నగర్ కాలనీలో అద్దెకు ఉంటున్నట్లు సమాచారం.
సుమారు 6 నెలల క్రితం సోషల్ మీడియా ద్వారా పరిచయం ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఆ పరిచయం క్రమంగా సన్నిహిత సంబంధంగా మారింది. ఈ విషయం తెలిసిన తర్వాత భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు చోటుచేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. కొంతకాలం రాజేశ్వరి శరత్‌ను దూరం పెట్టినా, అతడు మాటలతో మాయ చేసి తిరిగి దగ్గరయ్యాడని విచారణలో వెల్లడైంది. భర్త ప్రతిరోజూ మద్యం సేవించి వస్తాడని, తాను మంచిగా చూసుకుంటానని నమ్మబలికి ఇద్దరూ కలిసి ఉండాలంటే అతడిని అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
ఈ కుట్ర అమలు చేయడానికి గురువారం రాత్రి మద్యం సేవించి ఇంటికి వచ్చిన కృషతో రాజేశ్వరి గొడవ పడింది. అనంతరం అతడు నిద్రలోకి జారుకున్న తర్వాత ప్రియుడికి ఫోన్ చేసి ఇంటికి రప్పించింది. ఇద్దరూ కలిసి కృష కాళ్లు, చేతులు కట్టి, మొఖంపై దిండు పెట్టి శ్వాస ఆడకుండా చేశారు. అంతేకాక ఛాతిపై కూర్చుని ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
కృష మృతి చెందినట్లు నిర్ధారించుకున్న తర్వాత తెల్లవారుజామున వరకు అక్కడే ఉన్న శరత్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మరుసటి రోజు ఉదయం భర్త స్పందించడం లేదని చెప్పుతూ రాజేశ్వరి ఒక ఆటోను రప్పించి పట్నం మహేందర్ రెడ్డి వైద్య కళాశాలకు తీసుకెళ్లింది. అక్కడ వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు ప్రకటించారు. అనంతరం మృతదేహాన్ని తిరిగి ఇంటికి తీసుకొచ్చి తన తమ్ముడికి సమాచారం ఇచ్చింది.
ఈ విషయాన్ని తెలుసుకున్న కృష తల్లి అంజమ్మ అక్కడికి చేరుకుని పరిస్థితులను గమనించి కోడలిపైనే అనుమానం వ్యక్తం చేసింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. అనుమానాస్పద మరణంగా భావించిన పోలీసులు సూత్రప్రాయంగా విచారణ చేపట్టారు. కఠినంగా ప్రశ్నించగా రాజేశ్వరి నేరాన్ని ఒప్పుకున్నట్లు సమాచారం. ప్రియుడు శరత్‌ను కూడా అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. ఇద్దరినీ శనివారం రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వెల్లడించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చకు దారి తీసింది. పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ALSO READ: Icon Star: అల్లుఅర్జున్‌కు మరో అవార్డు

