
Actress Samira Sherif: కామంతో కళ్లు మూసుకుపోయిన దుర్మార్గులకు చిన్నా పెద్దా అనే తేడా ఉండడం లేదు. పసిపిల్లలపై కూడా లైంగిక దాడులకు పాల్పడుతూ తమ కోరికలు తీర్చుకుంటున్న ఘటనలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. పోక్సో వంటి కఠిన చట్టాలు అమలులో ఉన్నా.. పిల్లలపై జరుగుతున్న లైంగిక నేరాలు మాత్రం ఆగడం లేదన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
View this post on Instagram
ఈ నేపథ్యంలో తాజాగా ప్రముఖ సీరియల్ నటి సమీరా షెరీఫ్ భావోద్వేగంగా స్పందించింది. తన చిన్ననాటి జీవితంలో జరిగిన ఓ చేదు అనుభవాన్ని బయటపెడుతూ, పిల్లలకు చిన్న వయసు నుంచే అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆమె చెప్పుకొచ్చింది. తన అత్తయ్య, నటి సన నిర్వహించే యూట్యూబ్ ఛానల్‌లో జరిగిన సంభాషణలో సమీరా ఈ విషయాలను పంచుకుంది.
తన చిన్నప్పుడు ఎదురింట్లో ఉన్న కుటుంబానికి బంధువులు వచ్చేవారని, అందులో ఒక వయసులో పెద్దవాడు కూడా ఉండేవాడని సమీరా గుర్తుచేసుకుంది. మొదట అతడి ప్రవర్తన పిల్లల్ని ముద్దు చేసే సాధారణ చర్యగానే అనిపించిందని, అప్పట్లో తనకు దాని వెనుక అర్థం తెలియలేదని చెప్పింది. తాము రైల్వే క్వార్టర్స్‌లో ఉండేవాళ్లమని, అక్కడ పిల్లలంతా కలిసి ఆడుకునేవారని వివరించింది.
హైడ్ అండ్ సీక్ ఆట పేరుతో టెర్రస్ మెట్లు దగ్గరికి తీసుకెళ్లి ముద్దులు పెట్టడం మొదట ఫన్‌లాగా అనిపించిందని, కానీ ఒక దశలో అది అసౌకర్యంగా అనిపించిందని సమీరా చెప్పింది. వయసు పెరిగిన తర్వాతే అది ప్రేమ కాదని, తనపై కోరికలు తీర్చుకున్న చర్యగా అర్థమైందని వెల్లడించింది. ఒక రకంగా చెప్పాలంటే అది పిల్లలపై జరిగిన లైంగిక దాడితో సమానమని ఆమె వ్యాఖ్యానించింది.
ఆ సమయంలో పిల్లలకు ఇలాంటి విషయాలపై ఎలాంటి అవగాహన ఉండేది కాదని, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి తల్లిదండ్రులు కూడా చెప్పలేదని సమీరా ఆవేదన వ్యక్తం చేసింది. ఒకవేళ అప్పట్లో చెప్పినా, ముందుగా తననే ప్రశ్నించేవారేమో అన్న భయంతోనే మౌనంగా ఉండిపోయానని తెలిపింది. పిల్లలను ముందుగా తిట్టేస్తే, వాళ్లు మళ్లీ ఇలాంటి విషయాలు చెప్పే ధైర్యం చేయరని ఆమె హెచ్చరించింది.
పిల్లలకు ఎలాంటి పరిస్థితుల్లోనైనా నువ్వు తప్పు కాదని, మేము నీకు అండగా ఉన్నామని తల్లిదండ్రులు ధైర్యం ఇవ్వాలని సమీరా సూచించింది. ప్రేమ పేరుతో జరిగే వేధింపులను గుర్తించే అవగాహన పిల్లలకు చాలా అవసరమని, సమాజం మొత్తం దీనిపై మాట్లాడాల్సిన అవసరం ఉందని ఆమె పిలుపునిచ్చింది.
తెలుగులో ఆడపిల్ల, జీవితం, అభిషేకం, భార్యామణి, డా.చక్రవర్తి, మనసు మమత వంటి ఎన్నో సీరియల్స్‌లో నటించి గుర్తింపు పొందిన సమీరా.. వివాహానంతరం కుటుంబ జీవితానికి ప్రాధాన్యం ఇస్తోంది. అప్పుడప్పుడూ యూట్యూబ్ ఛానల్ ద్వారా తన అనుభవాలను ప్రేక్షకులతో పంచుకుంటూ, సమాజానికి అవసరమైన సందేశాలు ఇస్తోంది.
ALSO READ: పసిపాపపై తల్లి పైశాచికం.. వేడి అట్లకాడతో ప్రైవేట్ భాగాలపై వాతలు





