
నల్లగొండ (క్రైమ్ మిర్రర్ వెబ్‌డెస్క్): మాతృత్వం అంటే బిడ్డ కోసం ప్రాణాలనైనా త్యాగం చేసే శక్తి అని నమ్మిన సమాజం, నేటి ఘటనను చూసి తలదించుకుంటోంది. నల్లగొండ పట్టణ బస్టాండ్‌లో కన్నతల్లి తన చిన్నారిని ఒంటరిగా వదిలేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన ప్రేమికుడితో పరారైన ఘటన అందరినీ కలచివేసింది.
తల్లి తీరుతో తండ్రి కన్నీరు…
ఓ చిన్నారి బస్టాండ్‌లో ఒంటరిగా ఉండడం గమనించిన ప్రయాణికులు పోలీసులకు సమాచారం అందించగా, సీసీ కెమెరా ఫుటేజ్‌లో తల్లి స్వయంగా బిడ్డను వదిలి వెళ్తున్న దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి. ఆధారాలతో దర్యాప్తు చేసిన పోలీసులు తక్కువ సమయంలోనే ఆ మహిళను ఆమె ప్రేమికుడితో కలిసి అరెస్ట్ చేశారు.
ఇన్‌స్టాగ్రామ్ లో ప్రేమ.. ఇంటి తలుపులు మూసే ఉన్మాది తీరు
దర్యాప్తులో తల్లి ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన వ్యక్తితో ప్రేమలో పడినట్లు, తన భర్తను, కుటుంబాన్ని మర్చిపోయి కొత్త జీవితానికి నడక వేసిందని తేలింది. ఈ నేపథ్యంలో ఆమె భర్త పోలీసులను ఆశ్రయించి బిడ్డను తిరిగి పొందాడు. పోలీసులు ముగ్గురినీ స్టేషన్‌కు తీసుకెళ్లి కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం పిల్లాడిని అతడి తండ్రికి అప్పగించి, తల్లిపై చట్టపరమైన చర్యలు ప్రారంభించినట్లు సమాచారం.
“అది తల్లి కాదని” నిర్ఘాంతపోతున్న ప్రజలు
ఈ ఘటనపై నల్లగొండలోనే కాదు, సోషల్ మీడియా వేదికలపై కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. అదేమైనా తల్లి అయితే, పిల్లాడిని ఇలా నిర్లక్ష్యంగా వదిలేస్తుందా? అనే ప్రశ్నలతో నెటిజన్లు మండిపడుతున్నారు. “అక్రమ సంబంధాల కోసమే జీవితపు అర్ధం అయిన బిడ్డను త్యజించడం అనైతికం, అమానవీయం” అంటూ తల్లిపై మండిపడుతున్నారు. ఈ ఘటన మానవ సంబంధాల విలువల పతనానికి ప్రతీకగా నిలుస్తోంది. తల్లిదండ్రుల బాధ్యతలు, ప్రేమ అనే పదానికి గౌరవం, బిడ్డల భద్రత వంటి అంశాలపై సమాజం మరింతగా చైతన్యవంతమవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది.