శ్రీకాకుళం, క్రైమ్ మిర్రర్: శ్రీకాకుళం నగరంలో డయేరియా కేసులు కలకలం రేపాయి. పట్టణంలో 25 డయేరియా కేసులు నమోదయ్యాయి. దమ్మల వీధి, కాకి వీధి, గోల్కొండ రేవు, వాంబే కాలనీ, ఎల్బీఎస్ కాలనీ, బొడెమ్మ కోవెల ప్రాంతాల్లో పలువురు వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. కొందరు ఆసుపత్రిలో చేరారు.
విషయం తెలుసుకున్న కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆయా వీధులను సందర్శించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిని గూర్చి అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం కోసం వారిని ప్రైవేటు ఆసుపత్రులకు తరలిస్తామన్నారు. కొంత మందికి వీధుల్లోనే రిక్షాలు, అంబులెన్సుల్లో డీఎంహెచ్వో కె.అనిత ఆధ్వర్యంలో వైద్య సేవలు అందించారు.
మరోవైపు డయేరియా లక్షణాలతో బాధపడుతున్న ప్రాంతాల్లో కార్మికులు పారిశుద్ధ్య పనులు చేపట్టారు. కుళాయి నుంచి సరఫరా అయిన నీరు, వారు తినే ఆహారంలో ఏమైనా కారణం కావచ్చని అధికారుల భావిస్తున్నారు. జిల్లా కేంద్రంలో నెలకొన్న పరిస్థితిపై కేంద్ర, రాష్ట్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్నాయుడు, అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే గొండు శంకర్ కలెక్టర్ తో మాట్లాడి వివరాలు వివరాలు తెలుసుకున్నారు. సోమవారం రాత్రి అంతా వైద్యారోగ్య శాఖ, మున్సిపల్ సిబ్బందిని ఆయా వీధుల్లోనే ఉండాలని ఆదేశించారు.

