
-
రాత్రిళ్లూ ఆగని కిష్టరాయినిపల్లి ప్రాజెక్ట్ పనులు
-
అర్ధరాత్రులు డ్యూటీ చేస్తున్న అధికారి ఎవరు..!?
-
పనులు చేయిస్తున్నది ఎందుకు..!?
-
హవ్వా నిఘా లేని ప్రాజెక్ట్ పనులకు సర్టిఫై బిల్లులా..!?
-
నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణ పనులు..!?
-
ఓ చోట బావిలా నీరు ఊరుతున్న గ్రౌండ్ వర్క్
-
పంపు సెట్లతో నీటిని తోడుతూ పనుల కొనసాగింపు..?
-
ప్రశ్నించినవారికి కాంట్రాక్టర్ల నిర్లక్ష్య సమాధానం
-
మాదేం పోయిందన్న ధోరణిలో ఇరిగేషన్ అధికారులు.!?
-
నల్లమట్టి నాణ్యమైనదేనా..? అనుమతి ఇచ్చేది వీరే కదా..!?
-
అటవీశాఖ అనుమతులు లేక కొన్ని పనుల నిలిపివేత?
నల్లగొండ నిఘా ప్రతినిధి(క్రైమ్ మిర్రర్):- తిలాపాపం తలా పిడికెడు మాదిరిగా మారింది కిష్టారాయినిపల్లి రిజర్వాయర్ నిర్మాణం.!? ఈ ప్రాజెక్ట్ కోసం రైతులను, ప్రజలను నడి రోడ్డు మీద పడేసిన గత ప్రభుత్వం, ప్రజలు నెత్తినోరు కొట్టుకున్నా ఏండ్ల తరబడి నష్టపరిహారం ఇవ్వడంలో వెనకడుగు వేసింది. కొంతమంది కంటతడి పెట్టినా, ఎన్నో వేల కుటుంబాల జీవితాలు సస్యశ్యామలం అవుతాయని భూ నిర్వాసితులు త్యాగం చేశారనే మాట చిన్నదనే చెప్పుకోవాలి. ఎదురు తిరిగిన వారిపై దాడులు, కేసులు, బెదిరింపులు కొత్త కాదు ఆ బాధిత రైతన్నలకు. ఎన్నో ఆటుపొట్లను ఎదుర్కొంటూ, ఉద్యమాలు చేసి, పనులను ఆపి ప్రాణాలకు సైతం తెగించి కొట్లాడిన ప్రజలు, ఏనాడు కూడా ప్రాజెక్ట్ నిర్మాణాలకు అడ్డు చెప్పలేదు. పొట్ట చేతిలో పట్టుకొని, భవిష్యత్తు తరాలకు, తమ వారసులకు ఈ ప్రాజెక్ట్ ఉపయోగపడుతుందని కంటి నిండా శోకం ఉన్నా దిగమింగుకున్నారు నిర్వాసితులు.
ఏదేమైనా కొన్ని తరాలకు ఈ ప్రాజెక్ట్ సేవలు అందాలని నిండు మనసుతో ప్రజలు ఆకాక్షిస్తున్నారు. కానీ ఇవేమి పట్టింపు లేని కాంట్రాక్ట్ వ్యవస్థ, నాసిరకం మెటీరియల్ వాడుతూ, ఇస్టానుసారంగా కట్ట నిర్మాణం జరుగుతుందని ప్రజలు ఆరోపిస్తున్నారు. అధికారులు డ్యూటీలో ఉన్న సమయంలో కాకుండా, రాత్రుళ్లు సైతం ప్రాజెక్ట్ పనులు నిర్విరామంగా జరుగుతున్నాయని తెలుస్తోంది. రాత్రి పగలు అనే తేడానే లేకుండా, తక్కువ సమయంలో ఎక్కువ లాభం పొందే విధంగా, ఎక్కువ సెంట్రీలు కొడుతున్నారని ప్రచారం జరుగుతోంది. నిబంధనలకు పాతర వేస్తూ, తక్కువలో తక్కువ 1.0 మీటర్ సెంట్రీ కొడుతున్నారని, ఇలా అయితే కట్ట పరిస్థితి ఆగమ్యగోచరమే అంటున్నారు అనుభవజ్ఞులు..! ఏ రూల్స్ లేకుండా చేసే ఈ పనుల వల్ల రూ.లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారు వ్యాపారులు. ఇచ్చిన టాస్క్ కంప్లీట్ చేయాలని సిబ్బంది కూడా చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏ అధికారి విధుల్లో ఉన్నారని రాత్రి సమయాలలో పనులు చేస్తున్నారని, రాత్రి పనులు చేసే సిబ్బంది వివరాలు ఇవ్వాలంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇంత జరుగుతున్నా క్వాలిటీ కంట్రోల్ కనిపెట్టలేదా అంటే… అవేమి మాకు కొత్త కాదనే విధంగా వ్యవహరిస్తున్న అధికారుల తీరు చూస్తుంటే. కాంట్రాక్టర్‌తో ఉన్న ములాఖత్ ఏంటనేది అర్ధం కాని పరిస్థితి.!
Also Read : దానం నాగేందర్‌కు మంత్రి పదవి.. ఢిల్లీలో రేవంత్ చర్చలు..అసలు ప్లాన్ ఇదే!
ఓ చోట జరుగుతున్న గ్రౌండ్ వర్క్‌లో వరదలా ఊరుతున్న నీళ్లను సైతం, అరికట్టే ప్రయత్నం లేకుండానే, బురదలోనే నల్లమట్టి వేసి, బురదమడిలో పనులు పూర్తి చేస్తున్నారు అధికారులు. కాంట్రాక్టర్లను, అధికారులను ఇదేంటని ప్రశ్నిస్తున్న వారికి, నిర్లక్ష్యపు సమాధానం చెబుతున్నారు. ప్రాజెక్టుకు ఉపయోగించే ఇసుక, స్థానికంగా దొరికే నల్లమట్టి నాణ్యతగా ఉండటం లేదని, మట్టిని తలపించే ఇసుకను నిర్మాణానికి వాడుతున్నారని చెబుతున్నారు స్థానికులు. లోకల్‌గా దొరికే వనరులకు బిల్లులు పెడుతున్నారన్న టాక్ వినబడుతుంది. అటవీశాఖ నుంచి అనుమతులు రాకపోవడంతో కొంత మేరకు జాయింట్ పనులు నిలిపివేశారని ప్రచారం జరుగుతోంది. నిర్లక్ష్యపు నీడలో రిజర్వాయర్ పనులు పూర్తి చేస్తున్నారని అనేక ఆరోపణలు వినపడుతున్నాయి.
నిఘా వ్యవస్థ నిద్రిస్తే… క్రైమ్ మిర్రర్ కాపు కాస్తుంది.