తెలంగాణ రాష్ట్రంలో సామాజిక భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం అమలు చేస్తున్న చేయూత పథకం వేలాది కుటుంబాలకు ఆర్థిక ఆధారంగా నిలుస్తోంది. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు వంటి పలు వర్గాలకు ప్రతీ నెలా పింఛన్ అందిస్తూ జీవనోపాధికి తోడ్పడుతోంది. అదనంగా డయాలసిస్ చికిత్స పొందుతున్నవారు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు కూడా ఈ పథకం పరిధిలోకి తీసుకువచ్చి వారికి ఆర్థిక భరోసా కల్పిస్తోంది. ప్రభుత్వం అమలు చేస్తున్న ముఖ్య సంక్షేమ కార్యక్రమాల్లో ఈ పథకం ఒకటిగా నిలుస్తుండగా, వచ్చే ఆర్థిక సంవత్సరం 2026-27లో మరో 2 లక్షల కొత్త పింఛన్లు మంజూరు చేయనున్నట్లు మంత్రి సీతక్క అసెంబ్లీలో ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈ పథకానికి అర్హతల విషయానికి వస్తే.. వృద్ధాప్య పింఛన్ పొందాలంటే అభ్యర్థి వయస్సు కనీసం 57 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. అలాగే ఇతర పింఛన్ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నవారు అర్హులు కారు. దివ్యాంగులకు కనీసం 40 శాతం లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం ఉండాలి మరియు అది ప్రభుత్వ వైద్యుల ధృవీకరణతో ఉండాలి. వితంతు పింఛన్ కోసం భర్త మరణ ధృవపత్రం తప్పనిసరి కాగా, వయస్సు 18 సంవత్సరాలు నిండి ఉండాలి. బీడీ కార్మికులు పింఛన్ పొందాలంటే గుర్తింపు పొందిన పరిశ్రమలో పనిచేస్తూ, వయస్సు 18 సంవత్సరాలు పైబడి ఉండాలి. ఎయిడ్స్ బాధితులు, డయాలసిస్ పేషెంట్లకు వయోపరిమితి ఉండదు. అలాగే బోధనేతర సిబ్బందికి సంబంధించి ప్రభుత్వ లేదా ఎయిడెడ్ విద్యాసంస్థల్లో తక్కువ వేతనం పొందుతూ, వయస్సు 18 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉండే వారు అర్హులుగా పరిగణించబడతారు.
దరఖాస్తు ప్రక్రియ కూడా సులభంగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ప్రజా పాలన కేంద్రాలు, గ్రామ పంచాయతీలు, మండల పరిషత్ కార్యాలయాలు, మున్సిపల్ కార్యాలయాల్లో దరఖాస్తు పత్రాలు అందుబాటులో ఉంటాయి. వాటిని పూర్తిగా నింపి అవసరమైన పత్రాలతో కలిసి సమర్పించాలి. అవసరమైన పత్రాల్లో ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్, నివాస ధృవపత్రం, పాస్‌పోర్ట్ సైజు ఫోటో, రేషన్ కార్డు, ఆదాయ ధృవపత్రం, ఓటర్ గుర్తింపు పత్రం వంటి వివరాలు ఉండాలి. అధికారులు పరిశీలన అనంతరం అర్హుల జాబితాలో చేర్చి పింఛన్ మంజూరు చేస్తారు.
ఈ పథకం కింద లబ్ధిదారులకు ప్రతీ నెలా రూ.4000 పింఛన్ అందించబడుతుంది. గ్రామాలకు అధికారులు వచ్చి పింఛన్ పంపిణీ చేస్తారు. ఒకవేళ లబ్ధిదారు అందుబాటులో లేకపోతే 3 నెలల పింఛన్‌ను ఒకేసారి తీసుకునే అవకాశం కూడా ఉంది. ఈ విధానం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారికి సౌకర్యం కలుగుతోంది.
ఇదిలా ఉండగా, ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే లక్ష మందికి కొత్తగా పింఛన్లు మంజూరు చేసింది. ఇక 2026-27 ఆర్థిక సంవత్సరంలో మరో 2 లక్షల మందికి పింఛన్లు అందించేందుకు నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన నిధులను బడ్జెట్‌లో కేటాయించడం ద్వారా ప్రభుత్వం తన సంక్షేమ దృక్పథాన్ని మరోసారి చాటుకుంది. ఈ నిర్ణయం వల్ల మరింత మంది అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా లభించే అవకాశం ఉంది.
ALSO READ: వాట్సప్ ద్వారా అర నిమిషంలోనే ఆధార్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు..
