క్రైమ్ మిర్రర్ తెలంగాణ ఇన్వెస్టిగేషన్ బ్యూరో: క్రీడలు యువతలో ఆలోచనా శక్తిని, ఏకాగ్రతను, క్రమశిక్షణను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ శ్రీ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్ హైటెక్స్ ఎక్సిబిషన్ సెంటర్‌లో నిర్వహించిన ఏకాగ్ర ఇంటర్నేషనల్ ఓపెన్ రాపిడ్ చెస్ టోర్నమెంట్ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ శ్రీ పటేల్ రమేష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా శ్రీ పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ…. చెస్ వంటి మేధో క్రీడలు యువతలో ఆలోచనా శక్తిని, ఏకాగ్రతను, క్రమశిక్షణను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో చెస్ పోటీల నిర్వహణ ద్వారా తెలంగాణ రాష్ట్రానికి మంచి గుర్తింపు వస్తోందని అన్నారు. ఈ చెస్ పోటీలలో విజయం సాధించిన క్రీడాకారులకు ఏకాగ్ర సంస్థ వారు మొత్తం రూ. 22,22,222/- (ఇరవై రెండు లక్షల ఇరవై రెండు వేల రెండు వందల ఇరవై రెండు రూపాయలు) నగదు బహుమతిగా అందజేస్తున్నారని తెలిపారు.

ఇటువంటి ప్రోత్సాహకాలు క్రీడాకారులకు మరింత ఉత్సాహాన్ని అందించి, భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభను చాటుకునేందుకు దోహదపడతాయని పేర్కొన్నారు. ఈ అంతర్జాతీయ రాపిడ్ చెస్ టోర్నమెంట్‌లో దేశ విదేశాలకు చెందిన ప్రముఖ చెస్ గ్రాండ్‌మాస్టర్లు పాల్గొని, తమ ప్రతిభతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు, చెస్ క్రీడాకారులు, క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.





