-
బతుకమ్మ బహుమతులు వేలల్లో.. ప్రచార సభలకు కోట్లలో!
-
రాచకొండ ఉత్సవ సమితి ఆర్భాటం వెనుక అసలు లెక్కేంది?
-
సేవ చేయడానికా.. రాజకీయ పునాదులు వేసుకోవడానికా?
-
బతుకమ్మకు అగౌరవం.. భాస్కర్ మొఖాన్ని అతికించి ఆటలా..!
నల్లగొండ నిఘా ప్రతినిధి(క్రైమ్ మిర్రర్): మునుగోడు ప్రజల సమస్యలు ఎన్నో.. వాటికి పరిష్కారాలు మాత్రం అంతంతే! ఏళ్ల తరబడి ఫ్లోరైడ్ బాధితుల వెతలు, సాగునీటి కోసం రైతుల ఎదురుచూపులు, శివన్నగూడెం రిజర్వాయర్ కోసం ప్రజల డిమాండ్లు.. ఇవన్నీ ఒకవైపు ఉంటే, మరోవైపు సేవ పేరుతో కొత్త రాజకీయ ముఖాల పరిచయ కార్యక్రమాలు జోరందుకుంటున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈఎల్వీ భాస్కర్ ఫౌండేషన్, రాచకొండ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాల తీరు ఇప్పుడు ఇదే చర్చకు కేంద్రబిందువైంది. బతుకమ్మ బహుమతుల నుంచి భారీ సభల వరకు సాగుతున్న ఈ వ్యవహారంలో, ప్రజలకు దక్కుతున్న ప్రయోజనం ఎంత? వ్యక్తిగత ప్రచారానికి దక్కుతున్న ప్రాధాన్యం ఎంత? అన్న ప్రశ్నలు మునుగోడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
-బహుమతులు వేలల్లో! సభకు మాత్రం కోట్ల ఖర్చా?
బతుకమ్మ సంబరాల పేరుతో మండలాల వారీగా పదివేలు, ఇరవై వేల బహుమతులు ప్రకటించడం ఒకవైపు అయితే.. గట్టుప్పల్ మండలంలో రాచకొండ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో భారీ సభ నిర్వహించడం మరోవైపు. ఈ కార్యక్రమానికి సుమారు రెండు కోట్ల వరకు ఖర్చయిందనే అంచనాలు ప్రచారంలో ఉన్నాయి.!? ఈ మొత్తం అధికారిక ఖర్చుల లెక్కలతో నిర్ధారణ కావాల్సి ఉన్నప్పటికీ, బహుమతుల కోసం వెచ్చించిన మొత్తానికి, సభా ఆర్భాటానికి చేసిన ఖర్చుకు మధ్య ఉన్న వ్యత్యాసంపై మాత్రం ప్రశ్నలు తప్పడం లేదు. బహుమతులు పొందే మహిళలకు ఇచ్చే మొత్తం ఒక ఎత్తయితే, సభకు వచ్చే యాంకర్లు, హాస్య కళాకారులు, గాయకులు, ప్రముఖుల కోసం చేసే ఏర్పాట్లు మరో ఎత్తు. మరి ఇంతటి హంగామా ఎందుకు? పండుగను నిర్వహించడమే లక్ష్యమైతే ఇంత భారీ ప్రచార వ్యవస్థ అవసరమా? ప్రజాసేవే ప్రధాన ఉద్దేశమైతే ఆ డబ్బుతో వందల మందిని ఆదుకోవచ్చు అంటున్నారు అనుభవజ్ఞులు..!
‘చారణ కోడికి బారాణా మసాలా’ అన్నట్లు.. అసలు బహుమతుల కంటే వాటి చుట్టూ చేసే ప్రచారానికే ఎక్కువ ఖర్చు పెడుతున్నారా? అనే విమర్శలు వినిపిస్తున్నాయి. మునుగోడు నియోజకవర్గంలో ప్రజలకు సేవ చేయాలనే సంకల్పం ఉంటే, అదే మొత్తంతో ఎన్ని పేద కుటుంబాలకు వైద్య సహాయం అందించవచ్చు? ఎంతమంది విద్యార్థులకు చదువుకు అవసరమైన తోడ్పాటు ఇవ్వవచ్చు? ఫ్లోరైడ్ బాధిత కుటుంబాలకు ఎంతకాలం అండగా నిలవవచ్చు? అనే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. పండుగల పేరుతో ప్రజలను సమీకరించడం సులభమే. ప్రముఖులను తీసుకొచ్చి వేదికను వెలిగించడం కూడా సాధ్యమే. కానీ ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత ప్రజల జీవితాల్లో ఏ మార్పు వచ్చిందన్నదే అసలు లెక్క. సభకు వచ్చిన జనాన్ని చూపించడం కంటే, సేవల వల్ల ప్రయోజనం పొందిన కుటుంబాలను చూపించగలగాలి.
-ఎవరీ ఈఎల్వీ భాస్కర్? సేవ పేరుతో రాజకీయ రంగ ప్రవేశమా?
ఈఎల్వీ ఫౌండేషన్ పేరుతో ఈఎల్వీ భాస్కర్ చేపడుతున్న కార్యక్రమాలు, ఇప్పుడు మునుగోడులో రాజకీయ చర్చకు దారితీస్తున్నాయి. బతుకమ్మ సంబరాలు, భారీ సభలు, గ్రామాల్లో ప్రచారం, శివన్నగూడెం రిజర్వాయర్ అంశంపై ప్రభుత్వాన్ని నిలదీయడం.. ఇలా ఒకదాని వెంట మరొక కార్యక్రమంతో ఆయన పేరు ప్రజల్లోకి వెళ్తోంది. ప్రజాసేవ చేయడం తప్పు కాదు. రాజకీయాల్లోకి రావాలనుకోవడమూ తప్పు కాదు. కానీ సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల్లో గుర్తింపు పెంచుకుంటూ, మరోవైపు రాజకీయ సమీకరణాలకు అనుగుణంగా, అడుగులు వేస్తున్నారనే అభిప్రాయం ఏర్పడితే దానికి కారణాలపై చర్చ జరగడం సహజం. ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతోంది. ఈఎల్వీ భాస్కర్ లక్ష్యం ఏమిటి? ఫౌండేషన్‌ను సేవా సంస్థగానే కొనసాగించాలనుకుంటున్నారా? లేక మునుగోడు రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకోవాలనుకుంటున్నారా? రాజకీయ భవిష్యత్తు కోసం ఇప్పటి నుంచే భారీ కార్యక్రమాలతో పునాదులు వేసుకుంటున్నారా? ప్రజల సమస్యలపై పనిచేయాలనుకునే వ్యక్తి తన కార్యాచరణను స్పష్టంగా ప్రకటించాలి. ఎంతమందికి సహాయం చేశారు? ఏయే సమస్యలను పరిష్కరించారు? భవిష్యత్తులో ఏం చేయబోతున్నారు? అనే వివరాలు చెప్పాలి. కానీ కార్యక్రమాల ఆర్భాటం కనిపిస్తూ, సేవల ఫలితాలపై స్పష్టమైన లెక్కలు కనిపించకపోతే ప్రశ్నలు రావడం సహజమే. ప్రజలకు సేవ చేయడం ఒక లక్ష్యం.. ఆ సేవతో రాజకీయంగా ఎదగడం మరో లక్ష్యం. ఈ రెండింటి మధ్య గీత ఎక్కడుందో భాస్కర్ స్పష్టం చేయాల్సిన సమయం ఆసన్నమైంది.
-బీఆర్ఎస్ మెప్పు కోసమేనా? కాంగ్రెస్‌పై విమర్శల వెనుక రాజకీయ లెక్కలున్నాయా?
శివన్నగూడెం రిజర్వాయర్ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతున్న భాస్కర్ రాజకీయ వైఖరిపై చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ నేతలతో సంబంధాలు పెంచుకోవాలనే ప్రయత్నమా? ఆ పార్టీకి అనుకూలంగా ప్రజల్లో గుర్తింపు తెచ్చుకోవాలనే వ్యూహమా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ప్రజాస్వామ్య హక్కు. కానీ ఒక సమస్యను రాజకీయ ప్రచారానికి ప్రధాన అంశంగా ఎంచుకున్నప్పుడు, ఆ సమస్య పరిష్కారానికి తాను చేస్తున్న కృషి ఏమిటో కూడా చెప్పాలి. రిజర్వాయర్ పూర్తి చేయాలని డిమాండ్ చేయడం ఒకటైతే, ఆ డిమాండ్ సాధనకు ఎలాంటి కార్యాచరణ చేపట్టారు? నిర్వాసితుల సమస్యలపై ఏమి చేశారు? ప్రభుత్వానికి ఎలాంటి ఒత్తిడి తీసుకెళ్లారు? అన్నది మరో విషయం. బీఆర్ఎస్ నేతలను ఆహ్వానించినా వారు కార్యక్రమానికి హాజరు కాలేదనే అంశం కూడా రాజకీయ వర్గాల్లో చర్చకు వస్తోంది. నేతలు రాకపోవడంతో భాస్కర్ రాజకీయంగా ఏ వైపు అడుగులు వేస్తారన్న ఊహాగానాలు మొదలయ్యాయి. భాస్కర్ ప్రవర్తనే వారి గైర్వాజరుకు కారణం అని అనుకుంటున్నారు. అయినా ఈ పరిణామం ఆయన రాజకీయ సంబంధాలపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఒకవైపు అధికార పార్టీని విమర్శించడం, మరోవైపు ప్రతిపక్ష నేతల మద్దతు ఆశించడం.. ఈ రాజకీయ ప్రయాణంలో అసలు సిద్ధాంతం ఏమిటి? ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయమైతే పార్టీల మద్దతు కోసం ఎందుకింత ఆరాటం? ప్రజల సమస్యలు ఏ పార్టీకి అనుకూలంగా ఉన్నాయన్నదానిపై ఆధారపడవు కదా!
-ప్రచారానికి పెట్టే ఖర్చుతో ప్రజలకు శాశ్వత మేలు చేయలేరా?
మునుగోడులో ఫ్లోరైడ్ సమస్య ఉంది. పేద కుటుంబాలకు వైద్య అవసరాలు ఉన్నాయి. విద్యార్థులకు సహాయం కావాలి. రైతులకు సాగునీరు కావాలి. ఇలాంటి ప్రాంతంలో భారీ కార్యక్రమాలు నిర్వహించే సంస్థ, తన ఖర్చుల ప్రాధాన్యతను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత నుంచి తప్పించుకోగలదా!ఒక భారీ సభకు వెచ్చిస్తున్నారని చెబుతున్న మొత్తంతో, ఒక మండలంలోని నిరుపేద విద్యార్థులకు విద్యా సహాయం అందించవచ్చు. అర్హులైన బాధిత కుటుంబాలకు వైద్యపరంగా అండగా నిలవవచ్చు. నిరంతర సేవా కార్యక్రమాలకు నిధులు కేటాయించవచ్చు. అలాంటి ప్రత్యక్ష ప్రయోజనాలకంటే ప్రచార కార్యక్రమాలకే అధిక ప్రాధాన్యం కనిపిస్తే విమర్శలు రావడం సహజమే కదా..
ఇక్కడ ప్రశ్న ఉత్సవాలు ఎందుకు నిర్వహించారన్నది కాదు. వాటి కోసం చేసిన ఖర్చుతో పోలిస్తే ప్రజలకు అందుతున్న సేవలు ఏమిటన్నది. బహుమతుల పంపిణీతో పండుగ ముగిసిపోతుంది. కానీ పేదవాడి అవసరాలు అక్కడితో ముగియవు.
‘చేతిలో రూపాయి పెట్టి.. గోడకు పది రూపాయల రంగు వేయించినట్లు’ సేవల కంటే ప్రచారానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారనే అభిప్రాయం ప్రజల్లో ఏర్పడితే, దాన్ని తొలగించాల్సిన బాధ్యత ఫౌండేషన్‌దే. సాంప్రదాయలను భక్తిని తుంగలో తొక్కుతూ, బతుకమ్మకు భాస్కర్ ముఖాన్ని అతికించి ఆడించడం సిగ్గు చేటు అంటున్నారు పబ్లిక్..! మునుగోడు ప్రజలకు కావాల్సింది మరో కొత్త రాజకీయ ముఖం పరిచయం కావడం మాత్రమే కాదు. తమ కష్టాల్లో తోడుండే వ్యక్తులు కావాలి. మాటలతో ఆశలు కల్పించేవారు కాదు.. ఆ ఆశలను నిజం చేసేవారు కావాలి. నోరు తెరిస్తే ప్లోరైడ్ గురించి మాట్లాడే భాస్కర్, ప్లోరైడ్ బాధితులను కనీసం ఆ స్టేజ్ గడపను తాకనివ్వకపోవడం, ఈ ఖర్చులో సగం అలాంటి వారిని గుర్తించి సహాయం చెయ్యకపోవడం కోసమెరుపు. ఆర్థిక బలం ఉంటే ఆదుకో కానీ, ప్రజల అవసరాలను, ఆసరాగా చేసుకుంటూ వారి సమస్యలను వాడుకోవద్దని, రాజకీయ లబ్దికోసం హంగామాలు చెయ్యవద్దని ప్రజల అభిప్రాయం..!?
-
నిఘా వ్యవస్థ నిద్రిస్తే క్రైమ్ మిర్రర్ కాపుగాస్తుంది..
