– స్థానిక సంస్థల బరిలో ఓవైసీ పార్టీ
– రాయలసీమలో ముస్లిం ప్రభావిత ప్రాంతాల్లో ప్రభావం
– మైనారిటీ ఓట్లు చీలుతాయని జగన్ భయం
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో :-
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల జోరు కనిపిస్తోంది. ముందుగా మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే నామినేషన్ల దాఖలు లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడం.. అధికార కూటమి అప్రజాస్వామికంగా వ్యవహరించిందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో.. కీలక సూచనలు చేసింది అత్యున్నత న్యాయస్థానం. ఈనెల 25 వరకు మున్సిపల్ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించవద్దు అని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. అయితే ఈ పరిణామాలను పక్కన పెడితే మున్సిపల్ ఎన్నికల్లో అధికార కూటమి హవా కనిపిస్తోంది. ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లోనే ఏకగ్రీవాలు ఎక్కువగా జరిగాయి. ఇది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది కలిగించే విషయమే. అయితే వైసిపి పోటీలో ఉన్నచోట.. ఎంఐఎం బరిలో దిగడం ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారింది.
ముస్లింలు అధికం..
రాయలసీమ వ్యాప్తంగా ముస్లిం జనాభా అధికం. అటువంటి చోట పోటీ చేస్తోంది ఎంఐఎం. మొత్తం 21 స్థానాల్లో ఆ పార్టీ పోటీలో ఉంది. కడప మేయర్ అభ్యర్థిగా ఎంఐఎం తరపున నేత బరిలో ఉన్నారు. మరోవైపు హిందూపురం మున్సిపల్ చైర్మన్ పదవికి కూడా ఎంఐఎం పోటీపడుతోంది. ఈ రెండు చోట్ల మాత్రమే కాదు మరో 19 స్థానాల్లో పోటీకి సిద్ధపడుతోంది ఎంఐఎం. కచ్చితంగా ఇది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది కలిగించే విషయమే. ఎందుకంటే ఎంఐఎం ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చుతుందనే అభిప్రాయం ఉంది. టిడిపికి వ్యతిరేక ముద్ర కూడా ఉంది ఆ పార్టీకి.
నష్టం తప్పదా?
సాధారణంగా ముస్లిం మైనారిటీ ఓటు బ్యాంక్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అధికం. రాయలసీమలో ముస్లింలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అండగానే నిలుస్తూ వచ్చారు. అయితే అదే ముస్లిం పార్టీగా ముద్రపడిన ఎంఐఎం ఇప్పుడు బరిలో దిగుతుండడం వైసిపికి నష్టం అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడప మేయర్ పదవిపై ఎంఐఎం గురి పెట్టింది అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కచ్చితంగా ఇది టిడిపి కూటమికి లాభం చేకూర్చే విషయమని విశ్లేషకులు తేల్చి చెబుతున్నారు. వాస్తవానికి ఎంఐఎం ను రాయలసీమలో విస్తరించాలి అనేది ఓవైసీ సోదరుల లక్ష్యం. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ ఏపీలో పోటీ చేస్తుందని ప్రచారం నడిచింది. కానీ అది జరగలేదు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ ద్వారా తమ బలాన్ని పెంచుకోవాలని చూస్తోంది ఆ పార్టీ. మరి ఇందులో ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.
