– పవన్ కళ్యాణ్ కార్యాలయం పేరుతో ఫేక్ వాట్సాప్ ఛానల్
– ఏపీ రాజకీయాల్లో కలకలం
– సీరియస్ గా దృష్టి పెట్టిన యంత్రాంగం
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో :- ఏపీలో మరో భారీ సైబర్ నేరం బయటపడింది. ఏకంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యాలయం పేరును దుర్వినియోగం చేస్తూ.. ఫేక్ వాట్సాప్ ఛానల్ నిర్వహిస్తుండటం బయటపడింది. తీవ్ర కళకళ రేపంది. డిప్యూటీ సీఎం, ఆంధ్రప్రదేశ్ పేరుతో నకిలీ ఛానల్ ను క్రియేట్ చేసి.. దాని ద్వారా ప్రజలను పక్కదారి పట్టించేలా తప్పుడు సమాచారాన్ని, అసత్య ప్రచారాలను విస్తృతంగా వ్యాప్తి చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం వర్గాలు గుర్తించాయి. ప్రభుత్వ అత్యున్నత కార్యాలయం ముసుగులో జరుగుతున్న ఈ వ్యవహారంపై.. డిప్యూటీ సీఎం కార్యాలయ వర్గాలు తీవ్రంగా స్పందించాయి. ఈ మేరకు ప్రత్యేక పత్రిక ప్రకటన విడుదల చేస్తూ హెచ్చరికలు జారీ చేశాయి.
గుర్తించిన అధికారులు..
డిప్యూటీ సీఎంవో పేరుతో ఒక వాట్సాప్ ఛానల్ రన్ అవుతుండడాన్ని గుర్తించారు అధికారులు. సదరు నకిలీ వాట్సాప్ ఛానల్ కు ప్రభుత్వం లేదా డిప్యూటీ సీఎం కార్యాలయం తో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ కార్యాలయం గుర్తింపును దుర్వినియోగం చేస్తూ.. అసత్య ప్రచారాలను ఒడిగట్టడం తీవ్ర నేరమని.. ఇలాంటి చట్ట వ్యతిరేక చర్యలను ఎంత మాత్రం సహించేది లేదని తేల్చి చెప్పారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడానికి ఉపక్రమించారు. ఇప్పటికే ఎఫ్ఐఆర్ ను నమోదు చేశారు. సోషల్ మీడియాలో విచ్చలవిడిగా సాగుతున్న ఈ ఫేక్ ఛానల్ పట్ల ప్రజలు, నాయకులు, మీడియా అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
అధికారుల కీలక ఆదేశాలు..
డిప్యూటీ సీఎంఓ పేరుతో నడుస్తున్న వాట్సాప్ ఛానల్ ను ఎవరు ఫాలో కావద్దని.. దానిలోని సమాచారాన్ని ఇతరులకు షేర్ చేయడం గానీ చేయవద్దని స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు డిప్యూటీ సీఎం కార్యాలయ అధికారులు. అధికారిక సమాచారం, తాజా అప్డేట్ల కోసం కేవలం డిప్యూటీ సీఎం గుర్తింపు పొందిన బ్లూ టిక్ ఉన్న అధికారిక సామాజిక మాధ్యమాలు, వెరిఫైడ్ వాట్సాప్ ఛానల్ ను మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలని సూచిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి, డిప్యూటీ సీఎం స్థాయి వ్యక్తికి చెందిన కార్యాలయ పేరుతోనే పక్కదారి పట్టించేలా.. వ్యూహాత్మకంగా నకిలీ ఛానల్ నడపడం వెనుక రాజకీయ కుట్ర కోణాలు ఉన్నాయనే కోణంలో సైబర్ క్రైమ్ పోలీసులు విచారణను వేగవంతం చేశారు. డిజిటల్ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తూ ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చడానికి ప్రయత్నించే సైబర్ నేరగాళ్లను, వారి వెనుక ఉన్న సూత్రధారులకు చట్టం పరిధిలో తగిన బుద్ధి చెబుతామని కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
