విమానంలో చోటుచేసుకున్న అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించి 174 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ ప్రభుత్వం ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపింది. ఆయన ధైర్యాన్ని కొనియాడుతూ ముంబై నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ హోర్డింగులను ఏర్పాటు చేసింది. కెప్టెన్ స్మిత్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ముంబైలోని ఇజ్రాయెల్ కాన్సులేట్ జనరల్ ఈ ప్రచారాన్ని చేపట్టింది.
సెప్టెంబర్ 30న దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు బయలుదేరిన ఫ్లైదుబాయ్ విమానంలో ఈ ఘటన జరిగింది. విమానం గాల్లో ఉండగా సహ పైలట్ కెప్టెన్ స్మిత్‌పై కత్తితో దాడి చేశాడు. అంతేకాకుండా విమానాన్ని కూల్చేందుకు ప్రయత్నించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ దాడిలో స్మిత్ మెడ, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి.
అయితే తీవ్రంగా గాయపడినప్పటికీ కెప్టెన్ స్మిత్ ఏమాత్రం భయపడకుండా అప్రమత్తంగా వ్యవహరించారు. వెంటనే ఎమర్జెన్సీ అలర్ట్ బటన్‌ను నొక్కి కాక్‌పిట్ తలుపును తెరిచారు. దీంతో విమానంలోని ప్రయాణికులతో పాటు విధుల్లో లేని ఇద్దరు పైలట్లు స్పందించి సహ పైలట్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విమానాన్ని సౌదీ అరేబియాలోని తబుక్‌లో సురక్షితంగా ల్యాండ్ చేశారు.
ఈ విమానంలో 27 మంది చిన్నారులు సహా ఎక్కువ మంది ఇజ్రాయెల్ పౌరులు ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ప్రమాదకర పరిస్థితుల్లో కెప్టెన్ స్మిత్ చూపించిన అప్రమత్తత, ధైర్యం కారణంగా ప్రయాణికులు సురక్షితంగా బయటపడగలిగారు.
ఈ నేపథ్యంలోనే ముంబైలోని కీలక ప్రాంతాల్లో ఇజ్రాయెల్ కాన్సులేట్ భారీ హోర్డింగులను ఏర్పాటు చేసింది. వాటిపై కెప్టెన్ స్మిత్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ, ఇజ్రాయెల్ పౌరుల ప్రాణాలను కాపాడినందుకు ధన్యవాదాలు అని పేర్కొంటూ.. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది.
ఈ సందర్భంగా ఇజ్రాయెల్ కాన్సుల్ జనరల్ యానివ్ రెవాచ్ మాట్లాడుతూ కెప్టెన్ స్మిత్ భారత్‌తో పాటు ఇజ్రాయెల్‌కు కూడా హీరోగా నిలిచారని ప్రశంసించారు. ప్రస్తుతం స్మిత్ పూర్తిగా కోలుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని, ఆయన ఆరోగ్యం మెరుగుపడిన అనంతరం ఇజ్రాయెల్ ప్రభుత్వం అధికారికంగా సత్కరిస్తుందని తెలిపారు.
ప్రస్తుతం కెప్టెన్ స్మిత్ తబుక్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు దాడికి పాల్పడిన సహ పైలట్‌ను అరెస్ట్ చేసి యూఏఈకి తరలించినట్లు సమాచారం. ఈ ఘటనకు దారితీసిన పరిస్థితులు, దాడి వెనుక కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
కెప్టెన్ స్మిత్ ధైర్యసాహసాలపై భారత ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో పాటు పలువురు ప్రముఖులు ఇప్పటికే ప్రశంసలు వ్యక్తం చేశారు.
also read: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై హరీశ్ రావు అభ్యంతరం.. రాహుల్ గాంధీకి లేఖ
