జనావాసాల్లోకి చిరుతలు వస్తున్న ఘటనలు తరచూ భయాందోళనకు గురిచేస్తుంటాయి. అయితే ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్ జిల్లాలో ఓ చిరుతకు పెంపుడు కుక్క గట్టి షాక్ ఇచ్చింది. తనపై దాడి చేసిన చిరుతను ఏమాత్రం భయపడకుండా ఎదుర్కొని తరిమికొట్టింది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
వికాస్ భవన్ కార్యాలయానికి సమీపంలోని ఓ ఇంటి వద్ద ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. రాత్రి వేళ ఇంటి ఆవరణలోకి ఓ చిరుత నెమ్మదిగా ప్రవేశించింది. అక్కడ ఉన్న పెంపుడు కుక్కపై ఒక్కసారిగా దాడి చేసింది. అయితే ఊహించని విధంగా కుక్క కూడా ఎదురుదాడికి దిగింది.
ఇంటి గుమ్మం సమీపంలోనే చిరుత, కుక్క మధ్య కొద్దిసేపు తీవ్ర పోరాటం జరిగింది. కుక్క ప్రతిఘటనకు చిరుత వెనక్కి తగ్గింది. అంతటితో ఆగకుండా కుక్క కొంతదూరం వరకు చిరుతను తరిమింది. అనంతరం ఇంటి నుంచి ఓ వ్యక్తి బయటకు రావడం కూడా సీసీటీవీ కెమెరాలో రికార్డయింది.
ఈ ఘటనలో పెంపుడు కుక్క ప్రాణాలతో బయటపడింది. అయితే చిరుత జనావాసంలోకి వచ్చి దాడి చేయడం స్థానికుల్లో ఆందోళనకు కారణమైంది. గత కొంతకాలంగా రుద్రప్రయాగ్ పరిసర ప్రాంతాల్లో చిరుతల సంచారం పెరిగిందని స్థానికులు చెబుతున్నారు.
చిరుతల కదలికలతో మనుషులతో పాటు పెంపుడు జంతువులకు కూడా ముప్పు పొంచి ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో గస్తీని పెంచడంతో పాటు చిరుతల సంచారాన్ని గుర్తించి, వాటిని జనావాసాలకు దూరంగా తరలించేందుకు చర్యలు తీసుకోవాలని అటవీ శాఖ అధికారులను కోరుతున్నారు.
also read: కన్నడ పాఠశాలల కోసం రక్తంతో లేఖ.. ఉపాధ్యాయుడి వినూత్న నిరసన
