Homeక్రైమ్రాజస్థాన్‌లో చిరుత బీభత్సం.. ముగ్గురిపై దాడి.. ఐదు గంటల పాటు ఉత్కంఠ

రాజస్థాన్‌లో చిరుత బీభత్సం.. ముగ్గురిపై దాడి.. ఐదు గంటల పాటు ఉత్కంఠ

క్రైం మిర్రర్ : రాజస్థాన్‌లోని తోంక్ జిల్లాలో చిరుతపులి సృష్టించిన కలకలం స్థానికులను భయాందోళనలకు గురిచేసింది. అటవీ ప్రాంతం నుంచి జనావాసంలోకి ప్రవేశించిన చిరుతపులి వరుసగా ముగ్గురు వ్యక్తులపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. అనంతరం ఓ మద్యం దుకాణంలోకి దూరడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాదాపు ఐదు గంటలపాటు సాగిన ఉత్కంఠభరిత రెస్క్యూ ఆపరేషన్ అనంతరం అటవీ అధికారులు చిరుతను సురక్షితంగా బంధించారు.

అటవీ శాఖ అధికారుల వివరాల ప్రకారం.. సోమవారం ఉదయం తోంక్ జిల్లా తోదరైసింగ్ పట్టణంలోకి ఓ చిరుతపులి ప్రవేశించింది. పొదల్లో సంచరిస్తున్న చిరుతను గమనించిన స్థానికులు వెంటనే అటవీ శాఖకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఫారెస్ట్ వాలంటీర్ రాకేశ్ మాలి సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించే ప్రయత్నం చేయగా చిరుత ఒక్కసారిగా అతనిపై దాడి చేసింది. ఈ ఘటనలో అతని కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి.అక్కడి నుంచి వేగంగా పరుగెత్తిన చిరుత సమీప మార్కెట్ ప్రాంతంలోకి చేరుకుంది. అనంతరం ఓ మద్యం దుకాణం వద్ద కూర్చున్న 40 ఏళ్ల ఫతేహ్ లాల్ కోలీపై దాడి చేసి గాయపరిచింది. వెంటనే షాపులోకి చొరబడిన చిరుత అక్కడ ఉన్న 25 ఏళ్ల సంజయ్ గుర్జర్‌పై కూడా దాడి చేసింది. అయితే అతడు అప్రమత్తంగా బయటకు పరుగెత్తి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు.

చిరుత షాపు లోపలే ఉన్న సమయంలో స్థానికులు చాకచక్యంగా షట్టర్ మూసివేయడంతో అది బయటకు రాలేకపోయింది. ఇదే సమయంలో గాయపడిన ముగ్గురిని చికిత్స కోసం సమీప ఆస్పత్రికి తరలించారు. సీనియర్ వెటర్నరీ అధికారి అశోక్ తన్వర్ ఆధ్వర్యంలో ప్రత్యేక రెస్క్యూ బృందం రంగంలోకి దిగి చిరుతను బంధించేందుకు చర్యలు చేపట్టింది. మత్తు మందు వినియోగించి దాదాపు ఐదు గంటలపాటు శ్రమించిన అనంతరం చిరుతను సురక్షితంగా అదుపులోకి తీసుకున్నారు. అనంతరం దానిని తిరిగి అటవీ ప్రాంతానికి తరలించారు.

రెస్క్యూ ఆపరేషన్ జరుగుతున్న సమయంలో భారీ సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గుంపును నియంత్రించేందుకు పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేపట్టి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
also read : శంషాబాద్‌లో హృదయ విదారక ఘటన.. సంచిలో నవజాత ఆడ శిశువు కలకలం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు