నటసింహం నందమూరి బాలకృష్ణకు షూటింగ్ సందర్భంగా స్వల్ప గాయాలు కావడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ప్రస్తుతం తెరకెక్కుతున్న ‘NBK 111’ సినిమా షూటింగ్లో భాగంగా ఈ ఘటన చోటుచేసుకుంది.
కాకినాడ పోర్టు ప్రాంతంలో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా బాలకృష్ణ కాలికి గాయం అయినట్లు సమాచారం. యాక్షన్ సీన్ చేస్తున్న సమయంలో జరిగిన ఈ ప్రమాదాన్ని గమనించిన యూనిట్ సభ్యులు వెంటనే అప్రమత్తమై ఆయన్ను సమీప ఆసుపత్రికి తరలించారు.
వైద్యులు బాలకృష్ణకు అవసరమైన పరీక్షలు నిర్వహించిన తర్వాత పెద్దగా ప్రమాదం లేదని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అయితే కొద్ది రోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు సమాచారం. దీంతో అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.
ఇక ఈ సినిమా విషయానికి వస్తే, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఈ ప్రాజెక్ట్ వేగంగా తెరకెక్కుతోంది. ముంబై మాఫియా నేపథ్యంతో గ్యాంగ్‌స్టర్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ మూవీలో మంచు మనోజ్ కీలక పాత్రలో నటిస్తుండగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్గా కనిపించనుంది. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట్ సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు.
గతంలో బాలకృష్ణ – గోపీచంద్ మలినేని కాంబినేషన్లో వచ్చిన ‘వీరసింహారెడ్డి’ సూపర్ హిట్ కావడంతో, ఈ కొత్త సినిమాపై కూడా టాలీవుడ్లో భారీ ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా కొనసాగుతుండగా, చిత్రాన్ని డిసెంబర్ 2026లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
బాలకృష్ణకు స్వల్ప గాయం అయినప్పటికీ షూటింగ్ త్వరలోనే తిరిగి ప్రారంభమయ్యే అవకాశముంది. ఈ సంఘటనతో సినిమా పై మరింత హైప్ పెరిగిందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
also read: బ్యాంకులో పని పూర్తయ్యే వరకు ఇంటికి వెళ్లొద్దని తాళం వేసిన మేనేజర్.. వైరల్ వీడియోపై చర్చ