Homeసినిమాడ్యాన్సర్స్ అసోసియేషన్ వివాదానికి ముగింపు.. జానీ మాస్టర్‌పై నిషేధం ఎత్తివేత

డ్యాన్సర్స్ అసోసియేషన్ వివాదానికి ముగింపు.. జానీ మాస్టర్‌పై నిషేధం ఎత్తివేత

తెలుగు సినీ పరిశ్రమలో ఇటీవల చర్చనీయాంశంగా మారిన డ్యాన్సర్స్ అసోసియేషన్ వివాదానికి ఎట్టకేలకు పరిష్కారం లభించింది. ఫిల్మ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన అత్యవసర సమావేశంలో ఇరువర్గాల మధ్య నెలకొన్న విభేదాలు నివృత్తి చేయడంతో పాటు, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై విధించిన శాశ్వత నిషేధాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

ఈ సమావేశంలో ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ వల్లభనేని, దర్శకుల సంఘం ప్రతినిధి సాయి రాజేశ్, నిర్మాతల మండలి సభ్యులు చదలవాడ శ్రీనివాసరావు, ప్రసన్నకుమార్ పాల్గొన్నారు. జానీ మాస్టర్ మరియు డ్యాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలతతో విస్తృతంగా చర్చలు జరిపి, సమస్యకు పరిష్కారం కనుగొన్నారు.

సమావేశం అనంతరం అనిల్ వల్లభనేని మాట్లాడుతూ, ఇటీవల జరిగిన పరిణామాలపై ఇరువురు తమ వాదనలు వివరంగా వెల్లడించారని తెలిపారు. వారి వివరణతో ఫెడరేషన్ సంతృప్తి చెందినందున నిషేధాన్ని ఎత్తివేసినట్లు చెప్పారు. ఈ నెల 26న జరిగే జనరల్ బాడీ సమావేశంలో రాజీనామా చేసిన సభ్యులు తిరిగి చేరి, ఐక్యంగా పనిచేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.

జానీ మాస్టర్ స్పందిస్తూ, ఈ సమస్యకు ముగింపు రావడంలో ప్రముఖ నటులు చిరంజీవి, బాలకృష్ణ చూపిన చొరవ అభినందనీయమని పేర్కొన్నారు. సమస్యను సానుకూలంగా పరిష్కరించడంలో వారు కీలక పాత్ర పోషించారని తెలిపారు.

అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలత మాట్లాడుతూ, డ్యాన్సర్ల సంక్షేమమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన పరిణామాలకు పూర్తిస్థాయిలో తెరపడిందని, ఇకపై అందరూ కలిసి అసోసియేషన్ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.

నిర్మాతల మండలి ప్రతినిధులు కూడా స్పందిస్తూ, చిన్న చిన్న విభేదాలు ప్రతి కుటుంబంలోనూ ఉంటాయని, అవి పరిష్కారం కావడం సహజమని చెప్పారు. ఇకపై సభ్యులంతా ఐక్యంగా ముందుకు సాగుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. పరిశ్రమలో ఐక్యతను కాపాడేందుకు అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరాన్ని ఈ సంఘటన మళ్లీ గుర్తుచేసిందన్నారు.

also read: హైదరాబాద్‌లోని దోమలగూడ ప్రాంతంలో ముగ్గురు బాలికలు అదృశ్యం.. గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు