Homeతెలంగాణ"రైతు భరోసా'' కు నిరీక్షణ!

“రైతు భరోసా” కు నిరీక్షణ!

•మూడో విడత కోసం రైతుల ఎదురుచూపులు
•మరో వారం రోజుల్లో అంటూ ప్రచారం
•ప్రభుత్వం నుంచి స్పష్టత కరువు
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో :-
రైతు భరోసా నిధుల కోసం తెలంగాణ రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. పెండింగ్ నిధుల కోసం నిరీక్షిస్తున్నారు. మూడు విడతల్లో నిధులు జమ చేస్తామని ప్రభుత్వం చెప్పింది. రెండు విడతలుగా రెండు ఎకరాలకు నిధులు జమ చేసింది. దాదాపు నెల రోజులు గడుస్తున్న ఇంకా మూడో విడత నిధులు జమ చేయలేదు. రైతులు యాసంగి సాగును పూర్తిచేసుకుని.. వానాకాలం సాగుకు సమాయత్తం అవుతున్నారు. కానీ రైతు భరోసా మూడో విడత నిధులు ఇంతవరకు విడుదల కాలేదు. దీనిపైనే ప్రధానంగా ఇప్పుడు చర్చ నడుస్తోంది.

మరో మూడు వేల కోట్లకు పైగా పెండింగ్
తెలంగాణ వ్యాప్తంగా రైతులకు ఎదురుచూపులు తప్పడం లేదు. మార్చి 22న సిద్దిపేట జిల్లా నర్మెట్టలో సీఎం రేవంత్ తొలిసారిగా రైతు భరోసా నిధులను విడుదల చేశారు. తొలి విడతగా రూ.3447 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశారు. అక్కడికి 20 రోజుల వ్యవధిలో రెండో విడతలో రూ.2650 కోట్లు జమ చేస్తామని ప్రకటించారు. కానీ ఏప్రిల్ 20న జమ చేశారు. రెండు విడతల్లో కలిపి రూ.5510 కోట్లు పంపిణీ చేశారు. మొత్తం మూడు విడతల్లో రూ.9000 కోట్ల రూపాయలు పంపిణీ చేయాల్సి ఉంది. ఈ లెక్కన ఇంకా రూ.3490 కోట్లు పంపిణీ చేయాల్సి ఉంది.

ఖరీఫ్ సాగుకు సన్నద్ధం..
తెలంగాణలో యాసంగి పంట పూర్తయింది. ఖరీఫ్లో వరి సాగుకు సమాయత్తం అవుతున్నారు. ఇంకోవైపు రుతుపవనాల రాకతో వర్షాలు పడుతున్నాయి. రైతులు పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్నారు. రెండు విడతల్లో రైతు భరోసా అందించిన ప్రభుత్వం 20 రోజుల్లో మూడో విడత అందిస్తామని చెప్పింది. కానీ నెల రోజులు గడుస్తున్నా ఇంకా కదలిక లేదు. ప్రభుత్వం నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. అయితే అధికార పార్టీ నేతల అంతర్గత చర్చల్లో మాత్రం మరో వారం రోజుల్లో మూడో విడత రైతు భరోసా నిధుల విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ప్రభుత్వం అధికారికంగా స్పష్టత ఇవ్వాల్సి ఉంది.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు