క్రైమ్ మిర్రర్, సినిమా:- బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ వ్యక్తిగత జీవితం మరోసారి వార్తల్లో నిలిచింది. తన ప్రియురాలు గౌరీ స్ప్రాట్తో త్వరలో వివాహం చేసుకోబోతున్నారనే వార్తలు బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ప్రస్తుతం ఈ ప్రచారం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది.బాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం, జులై 5న ముంబైలోని తన నివాసంలో ఆమిర్ ఖాన్, గౌరీ స్ప్రాట్ వివాహం జరగనున్నట్లు ప్రచారం సాగుతోంది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే పాల్గొనేలా ఈ వేడుకను సాదాసీదాగా నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే పెళ్లి ఏర్పాట్లు కూడా ప్రారంభమైనట్లు బీటౌన్‌లో చర్చ జరుగుతోంది.
అయితే ఈ వివాహంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయినప్పటికీ బాలీవుడ్‌లో ఈ వార్త పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. వేడుకకు షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ వంటి ప్రముఖులు హాజరయ్యే అవకాశముందనే ప్రచారం కూడా వినిపిస్తోంది.గతేడాది తన 60వ పుట్టినరోజు సందర్భంగా గౌరీ స్ప్రాట్‌ను మీడియాకు పరిచయం చేసిన ఆమిర్ ఖాన్, తాము కొంతకాలంగా రిలేషన్‌షిప్‌లో ఉన్నామని వెల్లడించారు. పెళ్లి అనేది కేవలం ఒక వేడుక మాత్రమే కాదని, ఇద్దరు వ్యక్తుల మనసులు కలవడమే అసలు బంధమని ఆయన అప్పట్లో చేసిన వ్యాఖ్యలు విశేషంగా చర్చనీయాంశమయ్యాయి.
ఆమిర్ ఖాన్ వ్యక్తిగత జీవితాన్ని పరిశీలిస్తే, ఆయన మొదట రీనా దత్తాను వివాహం చేసుకున్నారు. వీరికి జునైద్, ఇరా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అనంతరం దర్శకురాలు, నిర్మాత కిరణ్ రావును రెండో వివాహం చేసుకున్నారు. వీరికి ఆజాద్ అనే కుమారుడు ఉన్నాడు. అయితే 2021లో ఇద్దరూ పరస్పర అంగీకారంతో విడిపోయారు.ఇప్పుడు 61 ఏళ్ల వయసులో ఆమిర్ ఖాన్ మూడోసారి పెళ్లి పీటలెక్కబోతున్నారనే వార్తలు అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. అయితే ఈ ప్రచారంలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే ఆమిర్ ఖాన్ లేదా ఆయన బృందం నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.