ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ ప్రతి ఒక్కరి జీవితంలో విడదీయరాని భాగంగా మారిపోయింది. ఉదయం నిద్రలేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు ఫోన్ వినియోగం కొనసాగుతూనే ఉంటుంది. ఉద్యోగ అవసరాలు, వ్యాపార కార్యకలాపాలు, కుటుంబ సభ్యులతో సంభాషణలు, స్నేహితులతో ముచ్చట్లు.. ఇలా ప్రతి పనికీ ఫోన్ కీలకంగా మారింది. అయితే మనం ఫోన్ కాల్ చేసినప్పుడు లేదా కాల్ అందుకున్నప్పుడు సహజంగానే నోటి నుంచి వచ్చే మొదటి పదం “హలో”. చిన్నప్పటి నుంచి ఈ పదాన్ని వింటూ, ఉపయోగిస్తూ వచ్చినప్పటికీ, అసలు ఫోన్‌లో “హలో” అనే పదం ఎందుకు వాడటం ప్రారంభమైందో చాలా మందికి తెలియదు. దీనికి సంబంధించిన ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నప్పటికీ, వాటిలో చాలా వరకు నిజం కాదని చరిత్ర చెబుతోంది.
ఫోన్‌ను కనిపెట్టిన అలెగ్జాండర్ గ్రాహం బెల్‌కు మార్గరెట్ హలో అనే యువతితో ప్రేమ సంబంధం ఉండేదని, ఆమె పేరునే ఫోన్‌లో మొదటిసారి పిలవడంతో “హలో” అనే పదం పుట్టిందని చాలా కాలంగా ఒక ప్రచారం కొనసాగుతోంది. అయితే చారిత్రక ఆధారాల ప్రకారం ఈ కథలో ఎలాంటి వాస్తవం లేదు. గ్రాహం బెల్ జీవితంలో ముఖ్యమైన వ్యక్తి మేబెల్ హోవార్డ్. ఆమెనే ఆయన తర్వాత వివాహం చేసుకున్నారు. కాబట్టి “హలో” అనే పదం ఒక యువతి పేరు నుంచి పుట్టిందనే ప్రచారం కేవలం కల్పిత కథ మాత్రమేనని చరిత్రకారులు స్పష్టం చేస్తున్నారు.
టెలిఫోన్ ప్రారంభ దశలో ప్రస్తుతం వినిపించే “హలో” అనే పదం కాకుండా ఇతర పదాలను కూడా విస్తృతంగా ఉపయోగించేవారు. ముఖ్యంగా “అహోయ్” అనే పదం అప్పట్లో బాగా ప్రాచుర్యం పొందింది. సముద్ర ప్రయాణాల్లో నావికులు ఒకరినొకరు పలకరించుకునే ఈ పదాన్ని టెలిఫోన్ సంభాషణల్లో కూడా ఉపయోగించేవారని సమాచారం. అలెగ్జాండర్ గ్రాహం బెల్ కూడా ఫోన్ ఎత్తినప్పుడు “అహోయ్” అని పలకడం ఇష్టపడేవారని చెబుతారు. కొంతమంది అయితే “మీరు వినగలుగుతున్నారా?” వంటి ప్రశ్నలతోనే సంభాషణను ప్రారంభించేవారు.
అయితే టెలిఫోన్ సంభాషణల చరిత్రలో కీలక మలుపు తీసుకువచ్చింది ప్రముఖ శాస్త్రవేత్త థామస్ ఎడిసన్. 1877లో ఫోన్ సంభాషణలను ప్రారంభించడానికి “హలో” అనే పదాన్ని ఉపయోగించాలని ఆయన సూచించారు. ఈ పదం చిన్నదిగా ఉండటమే కాకుండా స్పష్టంగా వినిపించడం, పలకడం సులభంగా ఉండటం వంటి కారణాల వల్ల ఎడిసన్ దీనికి ప్రాధాన్యత ఇచ్చారు. ఆ సూచన తర్వాత టెలిఫోన్ వినియోగదారులు క్రమంగా “హలో” అనే పదాన్ని అలవాటు చేసుకున్నారు. కాలక్రమేణా అది ప్రపంచవ్యాప్తంగా టెలిఫోన్ సంభాషణలకు అధికారిక పలకరింపులా మారిపోయింది. నేటికీ కోట్లాది మంది ప్రతి రోజూ ఫోన్ ఎత్తిన వెంటనే “హలో” అనే ఒక్క పదంతోనే సంభాషణను ప్రారంభించడం వెనుక ఇదే అసలు చరిత్రగా చెప్పబడుతోంది.
ALSO READ: Priyanka Nalkari: తప్పు చేశా.. అనుభవిస్తున్నా.. తెగ బాధపడుతున్న చబ్బీ బ్యూటీ!