నిద్ర మనిషి ఆరోగ్యానికి అత్యంత కీలకమైన సహజ ప్రక్రియ. శరీరానికి విశ్రాంతి ఇవ్వడమే కాకుండా మెదడు పనితీరును సమతుల్యం చేయడంలో నిద్ర ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఒక్క రోజు సరైన నిద్ర లేకపోయినా అలసట, చిరాకు, ఏకాగ్రత లోపం వంటి సమస్యలు వెంటాడతాయి. అయితే ఒక మనిషి ఎంతకాలం నిద్ర లేకుండా మేల్కొని ఉండగలడనే ప్రశ్నకు ఇప్పటికీ శాస్త్రవేత్తలు ఖచ్చితమైన సమాధానం ఇవ్వలేకపోయారు. ఆహారం లేకుండా కొన్ని వారాలు జీవించే అవకాశం ఉన్నప్పటికీ, నిద్ర లేకుండా ఎక్కువకాలం ఉండటం శరీరంపై ఎంతటి తీవ్రమైన ప్రభావం చూపుతుందో అనేక పరిశోధనలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఒక అరుదైన రికార్డు ఇప్పటికీ చర్చనీయాంశంగా నిలుస్తోంది.
గిన్నిస్ ప్రపంచ రికార్డుల చరిత్రలో నిద్ర లేకుండా అత్యధిక కాలం మేల్కొని ఉన్న వ్యక్తిగా రాబర్ట్ మెక్‌డొనాల్డ్ పేరు నమోదైంది. ఆయన ఏకంగా 18 రోజులు, 21 గంటలు, 40 నిమిషాల పాటు నిద్రపోకుండా గడిపినట్లు రికార్డులు చెబుతున్నాయి. దాదాపు 19 రోజుల పాటు నిద్రకు దూరంగా ఉండటం ద్వారా ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించినప్పటికీ, ఈ ప్రయోగం అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా దెబ్బతిన్నట్లు సమాచారం. మానసిక స్థితిలో తీవ్రమైన మార్పులు చోటుచేసుకోవడంతో పాటు శారీరకంగా కూడా అనేక సమస్యలు ఎదురయ్యాయి. ఈ తరహా ప్రయత్నాలు ప్రాణాలకు ముప్పుగా మారే ప్రమాదం ఉందని గుర్తించిన గిన్నిస్ సంస్థ 1997లో నిద్ర లేమికి సంబంధించిన రికార్డుల విభాగాన్ని పూర్తిగా తొలగించింది. భవిష్యత్తులో ఎవరూ ఇలాంటి ప్రమాదకర సాహసాలకు పాల్పడకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది.
వైద్య నిపుణుల ప్రకారం నిద్ర లేమి ప్రభావం చాలా వేగంగా కనిపించడం ప్రారంభమవుతుంది. 24 గంటల పాటు నిద్ర లేకపోతే శరీరంలో నీరసం పెరగడం, ఆవలింతలు రావడం, శక్తి స్థాయిలు తగ్గిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే 36 నుంచి 48 గంటల వరకు నిద్ర లేకుండా ఉంటే పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతుంది. మెదడు పనితీరు మందగించి ఆలోచనా సామర్థ్యం తగ్గిపోతుంది. ఏకాగ్రత పూర్తిగా దెబ్బతింటుంది. ఈ సమయంలో వాహనాలు నడపడం లేదా యంత్రాలపై పని చేయడం ప్రమాదకరంగా మారుతుంది. ప్రమాదాలు జరిగే అవకాశం అనేక రెట్లు పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కోపం, చిరాకు, మానసిక అస్థిరత వంటి సమస్యలు కూడా తీవ్రమవుతాయి. అంతేకాకుండా రోగనిరోధక శక్తి బలహీనపడటంతో వివిధ రకాల వ్యాధులు సోకే ప్రమాదం పెరుగుతుంది.
నిద్ర లేమి దీర్ఘకాలికంగా కొనసాగితే మరింత తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. రోజుకు 6 గంటల కంటే తక్కువ నిద్రపోయే వారిలో అధిక రక్తపోటు, మధుమేహం, ఊబకాయం, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వైద్య అధ్యయనాలు సూచిస్తున్నాయి. శరీరంలోని హార్మోన్ల సమతుల్యత దెబ్బతినడంతో జీవక్రియలు ప్రభావితమవుతాయి. శారీరక శక్తి తగ్గిపోవడంతో పాటు మానసిక ఆరోగ్యంపైనా ప్రతికూల ప్రభావం పడుతుంది. నిరంతరం నిద్రను నిర్లక్ష్యం చేయడం వల్ల జీవిత నాణ్యత క్రమంగా క్షీణించే ప్రమాదం ఉంది.
నిద్రలేమి సమస్యతో బాధపడుతున్న వారు కొన్ని సాధారణ అలవాట్లను పాటించడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు. ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, ఒకే సమయానికి మేల్కొనడం ద్వారా శరీర జీవ గడియారం క్రమబద్ధంగా పనిచేస్తుంది. పడుకునే ముందు మొబైల్ ఫోన్లు, టెలివిజన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలకు దూరంగా ఉండటం మంచిది. నిద్రించే గది ప్రశాంతంగా, చీకటిగా, అనుకూల ఉష్ణోగ్రతతో ఉండేలా చూసుకోవాలి. రాత్రి వేళల్లో అధికంగా ఆహారం తీసుకోవడం, కెఫిన్ కలిగిన పానీయాలు సేవించడం, మద్యం వినియోగించడం వంటి అలవాట్లను తగ్గించాలి. పొగాకు ఉత్పత్తులకు కూడా దూరంగా ఉండటం అవసరం. అలాగే ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయడం ద్వారా శరీరానికి సహజ అలసట కలిగి రాత్రివేళ గాఢ నిద్ర పట్టే అవకాశం పెరుగుతుంది. సరైన నిద్ర ఆరోగ్యకరమైన జీవితానికి పునాది అని నిపుణులు చెబుతున్నారు.
ALSO READ: క్రికెట్‌ను షేక్ చేసిన వైభవ్ సూర్యవంశీ రికార్డులివే..!