-
త్వరలో టిడిపి అధినేత బయోపిక్
-
రాజధాని ఫైల్స్ దర్శకుడు భాను ప్రకాష్ ప్రకటన
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: ఏపీ సీఎం చంద్రబాబు పై ఒక సినిమా రానుంది. ఆయన బయోపిక్ తీసేందుకు ఒక ప్రముఖ దర్శకుడు ముందుకు వచ్చాడు. ఇటీవలే చంద్రబాబు 76వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు భాను ప్రకాష్ చంద్రబాబు బయోపిక్ ను తీయాలని నిర్ణయించారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను నిర్మించేందుకు సన్నాహాలు ప్రారంభించారు. నిర్మాణ సంస్థతో పాటు కథానాయకులు, ఇతర తారాగణం గురించి త్వరలో ప్రకటించనున్నారు. దీనిపై టిడిపి శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.
గతంలో మహానేతలపై..
సాధారణంగా రాజకీయ నాయకుల బయోపిక్ లు వస్తుంటాయి. వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా యాత్ర అనే సినిమాను తెరకెక్కించారు. మమ్ముట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షక ఆదరణ పొందింది. అటు తరువాత నందమూరి తారక రామారావు బయోపిక్ ను ఆయన కుమారుడు నందమూరి బాలకృష్ణ తెరకు ఎక్కించారు. కథానాయకుడితో పాటు నాయకుడు పేరిట రెండు చిత్రాలను రూపొందించారు. ఎన్టీఆర్ గా నందమూరి బాలకృష్ణ కనిపించిన ఈ చిత్రాల్లో మిగతా నటులు కూడా వివిధ పాత్రలతో మెప్పించారు. ఇప్పుడు చంద్రబాబు బయోపిక్ రానుండడంతో అందరి దృష్టి ఆ చిత్రం పై పడింది.
రాజధాని రైతులపై..
వైసీపీ హయాంలో అమరావతి రాజధాని రైతులు పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో రాజధాని ఫైల్స్ పేరిట ఒక చిత్రాన్ని రూపొందించారు భాను ప్రకాష్. చక్కటి ఇతివృత్తంతో తాను చెప్పదలుచుకున్నది సూటిగా చెప్పారు భాను ప్రకాష్ ఆ చిత్రంలో. మంచి మార్కులే పడ్డాయి ఆ చిత్రానికి. అయితే ఇప్పుడు చంద్రబాబు బయోపిక్ తీయాలని భాను ప్రకాష్ నిర్ణయం తీసుకోవడం విశేషం. ఒక సాధారణ వ్యక్తిగా రాజకీయాల్లో ప్రవేశించి రాష్ట్ర నాయకుడిగా చంద్రబాబు మారిన తీరు.. నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా.. అదే స్థాయిలో ప్రతిపక్ష నేతగా.. జాతీయస్థాయి నాయకుడిగా విలక్షణ పాత్ర పోషించారు చంద్రబాబు. వాటిని ఈ చిత్రం ద్వారా సజీవంగా చూపించనున్నారు భాను ప్రకాష్.. అయితే చంద్రబాబు పాత్ర ఎవరు పోషిస్తారు? మిగతా నాయకుల పాత్రలు ఎవరు చేస్తారు? అనే విషయాలను త్వరలో వెల్లడించనున్నారు భాను ప్రకాష్.