హైదరాబాద్, క్రైమ్ మిర్రర్: వేసవి కాలంలో ఫ్రిజ్ వినియోగం.. ప్రతి ఒక్క ఫ్యామిలీకి చాలా పెరుగుతుంది. బయట ఎండ ఎక్కువగా ఉండటం వల్ల మనం తినే ఆహారం త్వరగా పాడవకుండా ఉండాలంటే ఫ్రిజ్‌పై ఎక్కువగా ఆధారపడాల్సి వస్తుంది. అయితే ఈ సమయంలో కొన్ని చిన్న తప్పులు చేస్తే ఫ్రిజ్‌లోని కంప్రెసర్‌పై ఎక్కువ ఒత్తిడి పడుతుంది. అది ఎక్కువ వేడెక్కితే ఫ్రిజ్ పనితీరు తగ్గిపోవచ్చు, కొన్నిసార్లు ప్రమాదకర పరిస్థితులు కూడా ఎదురవుతాయి. అందుకే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి.
ముందు తెలుసుకోవాల్సింది అదే…!
మొదటగా ఫ్రిజ్‌ను ఎక్కడ ఉంచుతున్నామో చాలా ముఖ్యం. చాలామంది కిచెన్‌లో స్పేస్ కోసం గోడకు దగ్గరగా ఫ్రిజ్ పెట్టేస్తారు. కానీ ఇలా చేస్తే గాలి సరిగా వెళ్లదు. ఫ్రిజ్ వెనుక భాగానికి కనీసం 4 నుంచి 6 అంగుళాల దూరం ఉండాలి. ఇలా గాలి సరిగ్గా తిరిగితే లోపలి వేడి బయటకు వెళ్తుంది. లేదంటే కంప్రెసర్ ఎక్కువగా పని చేసి వేడెక్కుతుంది.
ఆ సెట్టింగ్ మర్చిపోకండి…
ఇంకో ముఖ్యమైన విషయం టెంపరేచర్ సెట్టింగ్. వేసవిలో చాలా చల్లగా కావాలని ఫ్రిజ్‌ను మాక్సిమమ్‌లో పెట్టడం చాలామంది చేస్తారు. కానీ ఇది సరైన పద్ధతి కాదు. ఫ్రిజ్‌కు సరైన టెంపరేచర్ 3°C నుంచి 5°C మధ్య ఉండాలి. ఈ రేంజ్‌లో ఫ్రిజ్ సరిగ్గా పనిచేస్తుంది. మాక్సిమమ్‌లో పెడితే కంప్రెసర్ నిరంతరం పనిచేసి త్వరగా పాడయ్యే అవకాశం ఉంటుంది.
ఫ్రిజ్ నుంచి వచ్చే శబ్దాలను కూడా గమనించాలి. ఫ్రిజ్ సరిగ్గా కూలింగ్ చేయకపోవడం లేదా తరచూ “క్లిక్” అనే శబ్దం రావడం లాంటి సమస్యలు ఉంటే అది ఒక హెచ్చరిక. అప్పుడు కొంతసేపు ఫ్రిజ్ ఆఫ్ చేసి మళ్లీ ఆన్ చేయాలి. సమస్య అలాగే ఉంటే వెంటనే టెక్నీషియన్‌ను సంప్రదించడం మంచిది.
కూలింగ్ కాయిల్స్ శుభ్రంగా ఉంచడం కూడా చాలా అవసరం. ఫ్రిజ్ వెనుక భాగంలో ఉన్న కాయిల్స్‌పై దుమ్ము పేరుకుంటే వేడి బయటకు వెళ్లదు. దీంతో కంప్రెసర్‌పై ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి కొంతకాలానికి ఒకసారి ప్లగ్ తీసి కాయిల్స్‌ను శుభ్రం చేయాలి. ఇది ఫ్రిజ్ పనితీరును మెరుగుపరుస్తుంది.
ఫ్రిజ్ డోర్ సీల్ కూడా బాగుండాలి. అది లూజ్‌గా ఉంటే చల్లని గాలి బయటకు వెళ్లిపోతుంది. దీంతో ఫ్రిజ్ ఎక్కువగా పనిచేయాల్సి వస్తుంది. సీల్ సరిగా ఉందో లేదో చెక్ చేసి అవసరమైతే మార్చడం మంచిది.
ఈ తప్పు చేశారంటే ఇక అంతే సంగతి!
చివరిగా ఫ్రిజ్‌ను పూర్తిగా నింపకూడదు. చాలా పదార్థాలు పెట్టేస్తే గాలి సరిగా తిరగదు. ఫ్రిజ్‌లో కొంత ఖాళీ ఉండేలా చూసుకోవాలి. సాధారణంగా 70% వరకు మాత్రమే నింపితే మంచిది.
ఈ చిన్న జాగ్రత్తలు పాటిస్తే మీ ఫ్రిజ్ ఎక్కువ కాలం పనిచేస్తుంది. అలాగే అనవసర ఖర్చులు, ప్రమాదాలను కూడా దూరం పెట్టవచ్చు.
