Homeతెలంగాణమునుగోడు ఆశ..రాజన్న శ్వాస..

మునుగోడు ఆశ..రాజన్న శ్వాస..

  • మునుగోడు ఆశ..రాజన్న శ్వాస..

  • సేవలో సాటిలేని నాయకుడికి దక్కాలి మంత్రి పీఠం!

  • మంత్రి పదవిపై అధిష్టానం వంచన ఎందుకు?.

నల్లగొండ నిఘా ప్రతినిధి(క్రైమ్ మిర్రర్): ​తెలంగాణ రాజకీయ చిత్రపటంలో, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక ప్రత్యేక నాయకుడు. కేవలం అధికారం కోసం రాజకీయాలు చేసే నాయకుల మధ్య, తన సంపాదనను ప్రజల కోసం ఖర్చు చేస్తూ, ఆపదలో ఉన్నవారికి నేనున్నాను అంటూ, భరోసా ఇచ్చే ఆయన శైలి అద్వితీయం. మునుగోడు ప్రజలు ఆయనను కేవలం ఒక ఎమ్మెల్యేగా చూడటం లేదు, ఒక పెద్ద దిక్కుగా, ఒక ఆపద్బాంధవుడిగా కొలుస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి చేసిన సేవలు, ఏ రాజకీయ పదవికి తక్కువ కావు.

తన తల్లి స్మృత్యర్థం స్థాపించిన కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్, ద్వారా ఆయన చేసిన పనులు అసంఖ్యాకం. మునుగోడులో వేలాది మంది కంటి సమస్యలతో బాధపడుతుంటే, ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహించి, స్వయంగా దగ్గరుండి శస్త్రచికిత్సలు చేయించారు. వందలాది మందికి కంటి చూపును ప్రసాదించిన ‘రాజన్న’పై ప్రజల్లో అపారమైన గౌరవం ఉంది. అత్యవసర సమయాల్లో ఆసుపత్రులకు వెళ్లడానికి ఇబ్బంది పడుతున్న గ్రామస్తుల, కోసం ఉచిత అంబులెన్స్ సేవలను అందుబాటులోకి తెచ్చారు. ఇది ఎంతో మంది గర్భిణీ స్త్రీలకు, వృద్ధులకు ప్రాణవాయువులా మారింది.

​కరోనా కష్టకాలంలో కొండంత అండగా నిలిచారు ఆయన. ప్రపంచమంతా భయంతో వణికిపోతున్న వేళ, రాజగోపాల్ రెడ్డి తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజల్లోకి వెళ్లారు. సుమారు 10 నుండి 15 కోట్ల రూపాయల సొంత నిధులతో, నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. పేద విద్యార్థులు చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో, ఎంతో మందికి ఇంజనీరింగ్, మెడిసిన్ ఫీజులు చెల్లించి వారి భవిష్యత్తుకు బాటలు వేశారు.

మంత్రి పదవితోనే మునుగోడు అభివృద్ధి

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి అనివార్యమనే చెప్పుకోవాలి. ​మునుగోడు అంటేనే ఫ్లోరోసిస్ శాపం. దశాబ్దాలుగా ఈ ప్రాంతం వెనుకబడి ఉంది. రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా నిధులు తెస్తున్నప్పటికీ, ఒక మంత్రిగా ఆయనకు ఉండే అధికారం, ప్రభావం మునుగోడు దశను మార్చగలవు. డిండి ప్రాజెక్టులు పూర్తి కావాలని, నియోజకవర్గంలో పరిశ్రమలు ఏర్పాటు చేసి, స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించాలనేది ఆయన కల. అది మంత్రి పదవి ద్వారానే సులభతరం అవుతుంది.

నిబద్ధతకు దక్కని ఫలితం?

​కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు, తెలంగాణలో పార్టీ పునర్వైభవం కోసం రాజగోపాల్ రెడ్డి చేసిన కృషి ఎనలేనిది. పార్టీ కోసం తన పదవిని త్యాగం చేసి ఉపఎన్నికకు వెళ్లిన ధైర్యశాలి ఆయన. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకు సముచిత స్థానం కల్పిస్తామని అధిష్టానం మాట ఇచ్చింది. కానీ నేడు క్యాబినెట్ లో చోటు కల్పించకుండా, మొండిచేయి చూపడంపై మునుగోడు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడే నాయకుడు, సొంత ప్రభుత్వం తప్పు చేసినా ప్రశ్నించే నైజం ఉన్న నాయకుడు కాబట్టే, ఆయనను పక్కన పెడుతున్నారా? అని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ​

ప్రస్తుతం అధికార పార్టీలోనే ఉన్నప్పటికీ, రాజగోపాల్ రెడ్డి ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో ఆయన ముందుంటున్నారు. తన నియోజకవర్గానికి అన్యాయం జరిగితే అసెంబ్లీలో, గర్జించడానికి కూడా ఆయన వెనకాడటం లేదు. ప్రజల పట్ల ఆయనకున్న ప్రేమ అలాంటిది. దమ్మున్న లీడర్‌కు దక్కాల్సిన గౌరవం,​రాజగోపాల్ రెడ్డి అంటే ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. పార్టీలతో సంబంధం లేకుండా, ఏ జెండా పట్టుకున్నా గెలిచి వచ్చే మాస్ లీడర్.

మునుగోడు ప్రజలను కన్నబిడ్డల వలె చూసుకుంటున్న, ఈ అపద్బాంధవుడికి మంత్రి పదవి దక్కకపోవడం ఆ ప్రాంత అభివృద్ధికి అడ్డంకిగా మారింది. ​కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికైనా కఠినత్వం వీడి, మునుగోడు ప్రజల ఆకాంక్షను గుర్తించి, రాజగోపాల్ రెడ్డికి తగిన పదవిని ఇచ్చి గౌరవించాలి. అప్పుడే తెలంగాణలో నిజమైన ప్రజాస్వామ్యానికి, నిబద్ధత కలిగిన నాయకత్వానికి గుర్తింపు లభిస్తుంది.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

2 COMMENTS

  1. మునుగోడు నియోజకవర్గ శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేద ప్రజల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేస్తున్న నాయకుడిగా స్థానికంగా గుర్తింపు పొందుతున్నారు. ప్రజాసేవే లక్ష్యంగా పనిచేస్తున్న ఆయనకు రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం కల్పించకపోవడంపై కాంగ్రెస్ ప్రభుత్వంపై కొన్ని వర్గాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
    అదే సమయంలో, హైడ్రా (HYDRA) చర్యల కింద పేదల ఇండ్ల కూల్చివేతలపై కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ చర్యలు ప్రజల్లో ఆందోళనకు దారి తీస్తున్నాయని విమర్శకులు అంటున్నారు.
    ఇలాంటి నేపథ్యంలో, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని కొందరు ప్రజలు మరియు అనుచరులు కోరుతున్నారు.

  2. మునుగోడు నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్న నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అని స్థానిక నేత ధర్మ నాయక్ అన్నారు. ప్రజా సేవకుడిగా ఆయన చేస్తున్న కృషి ప్రత్యేకమని, మద్యం పాలసీలలో కొత్త ట్రెండ్‌ను తీసుకువచ్చిన నాయకుడిగా గుర్తింపు పొందారని తెలిపారు.
    ప్రజల సమస్యలను అర్థం చేసుకుని పరిష్కరించడంలో ముందుండే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి రాష్ట్ర మంత్రివర్గంలో అవకాశం కల్పించాలని ధర్మ నాయక్ డిమాండ్ చేశారు. మునుగోడు ప్రజల ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకుని ఆయనకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు