Homeతెలంగాణఆమనగల్లు శ్రీ శ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామి జాతర తొలి రోజు

ఆమనగల్లు శ్రీ శ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామి జాతర తొలి రోజు

  • ఘనంగా అమ్మవారికి లక్ష కుంకుమార్చన

  • 300 మందికి పైగా పాల్గొన్న భక్తులు

క్రైమ్ మిర్రర్, వేములపల్లి ప్రతినిధి: మండల పరిధిలోని ఆమనగల్లు గ్రామంలో ఉన్న ప్రాచీన క్షేత్రం శ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామి ఆలయంలో నిర్వహిస్తున్న శ్రీ శ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామి దేవస్థానం జాతర తొలి రోజు కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా ప్రారంభమయ్యాయి.

జాతరలో భాగంగా మొదటి రోజు ఉదయం 10 గంటలకు శాస్త్రోక్తంగా గణపతి ప్రార్థనతో పూజా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అనంతరం పంచామృత రుద్రాభిషేకం, అమ్మవారికి లక్ష కుంకుమార్చన, అష్టోత్తర శతనామ పూజలు, మంగళ నీరాజన కార్యక్రమాలు వైభవంగా నిర్వహించబడ్డాయి.

వేద మంత్రోచ్చారణల మధ్య పూజలు సాగుతుండగా ఆలయ ప్రాంగణం భక్తి వాతావరణంతో మార్మోగింది. ఈ పూజా కార్యక్రమాలను వేద పండితులు సతీష్ శర్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జాతర తొలి రోజున నలుమూలల గ్రామాల నుంచి వచ్చిన మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం విశేషం.

సుమారు 300 మందికి పైగా భక్తులు ఈ పవిత్ర పూజల్లో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. లక్ష కుంకుమార్చన పూజలో పాల్గొనడం వల్ల సౌభాగ్యం, శాంతి, సకల శుభాలు కలుగుతాయనే విశ్వాసంతో మహిళలు ప్రత్యేక భక్తితో పూజలు నిర్వహించారు.

పూజా కార్యక్రమాల అనంతరం దేవాలయ కమిటీ చైర్మన్ బ్రహ్మదేవ విద్యాసాగర్, గ్రామ సర్పంచ్ పిల్లల సందీప్ ఆధ్వర్యంలో అన్నదాతల సహకారంతో ఘనంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ అన్నదానంలో పాల్గొన్న భక్తులు ప్రసాద స్వీకరణతో ఆనందం వ్యక్తం చేశారు. ఐదు రోజుల పాటు కొనసాగనున్న ఈ జాతరలో భాగంగా ప్రతిరోజూ వివిధ పూజా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది.

గ్రామ ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జాతరను విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. భక్తి, ఐక్యత, సంప్రదాయాల ప్రతీకగా నిలిచే ఈ జాతర ఆమనగల్లు గ్రామానికి ప్రత్యేక శోభను తీసుకువచ్చిందని గ్రామ పెద్దలు అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమంలో లక్ష్మీదేవిగూడెం సర్పంచ్ ఎలికట్టి భరత్ ఉప సర్పంచ్ శాలెం రాజు వార్డ్ మెంబర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు