Tuesday, March 10, 2026
Homeఅంతర్జాతీయంMEA: ఇండియా నుంచి చైనాకు వెళ్తున్నారా? అయితే, కాస్త జాగ్రత్త!

MEA: ఇండియా నుంచి చైనాకు వెళ్తున్నారా? అయితే, కాస్త జాగ్రత్త!

MEA Warns Citizens: భారత్- చైనా మధ్య ఇప్పుడిప్పుడే సంబంధాలు మెరుగుపడుతున్న నేపథ్యంలో భారత విదేశాంగశాఖ కీలక సూచనలు చేసింది. చైనాకు ప్రయాణించేటప్పుడు, ఆ దేశం మీదుగా రాకపోకలు సాగించేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని భారత పౌరులకు సూచించింది. గత నెలలో పెమా వాంగ్‌జోమ్ థాంగ్‌ డోక్ అనే భారత మహిళకు ట్రాన్సిట్ హాల్ట్ కోసం చైనాలోని షాంఘైలో దిగినప్పుడు ఎదురైన చేదు అనుభవం నేపథ్యంలో ఎంఈఏ ఈ తాజా ఆదేశాలు జారీ చేసింది.

అంతర్జాతీయ విమాన నిబంధనలు గౌరవించాలి!

చైనాకు ప్రయాణించేటప్పుడు, చైనా మీదుగా రాకపోకలు సాగించేటప్పుడు భారతీయులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎంఈఏ ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ సూచించారు. బీజింగ్ అంతర్జాతీయ విమాన ప్రయాణ నిబంధనలను గౌరవిస్తుందని ఆశిస్తున్నామని అన్నారు. అరుణాచల్ ప్రదేశ్ ముమ్మాటికీ భారత్‌ లో భూభాగమేనని మరోసారి స్పష్టం చేశారు. ఈ విషయం ఇప్పటికే చాలాసార్లు చెప్పామని, ఇందులో ఎవరి జోక్యాన్ని తాము కోరుకోవడం లేదని తెలిపారు. ఇండియా-చైనా సంబంధాలపై మాట్లాడుతూ.. ఇరుదేశాల సంబంధాల్లో సానుకూల పురోగతి కనిపిస్తోందని, ఆ దిశగా ముందుకు సాగాలని తాము కోరుకుంటున్నామని చెప్పారు.

అసలు ఏం జరిగిందంటే?

పెమా వాంగ్‌ జోమ్ థాంగ్‌ డోక్ గత నెలలో లండన్ నుంచి జపాన్‌కు వెళ్తూ ట్రాన్సిట్ హాల్ట్ కోసం చైనాలోని షాంఘైలో దిగారు. తన రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్ కావడంతో పాస్‌ పోర్ట్‌ చెల్లదని అక్కడ అధికారులు తనను అడ్డుకున్నట్టు ఆమె చెప్పారు. స్థానిక భారత దౌత్య కార్యాలయాన్ని సంప్రదించడంతో తనకు సాయం అందిందని తెలిపారు. ఈ ఘటనను భారత్ ఖండించింది. అయితే థాంగ్‌ డోక్‌ను తాము నిర్బంధించ లేదని చైనా విదేశాంగ శాఖ ప్రకటించింది. గత కొద్ది నెలలుగా ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగు అవుతున్న నేపథ్యంలో ఇలాంటి కవ్వింపు చర్యలు రెండు దేశాలకు నష్టమేనని అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చైనా తన దూకుడును తగ్గించుకోవాలని సూచిస్తున్నారు.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను.2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను.ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments