
Russia Earthquake: రష్యాను వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. రీసెంట్ గా కమ్చాట్కా తీరంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత ఏకంగా 8.8గా నమోదైంది. తాజాగా మరోసారి అదే ప్రాంతంలో భూకంపం ఏర్పడింది. మంగళవారం ఉదయం కమ్చాట్కా తీరంలోనే భూమి కంపించింది. ఈసారి భూకంప తీవ్రత 6.0గా నమోదైంది. భూకంప ప్రభావంతో ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
జులై 30న కమ్చాట్కా తీరంలో భారీ భూకంపం
జులై 30న కమ్చాట్కా తీరంలోనే భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం కారణంగా రష్యా, జపాన్, ఉత్తర పసిఫిక్ తీరంలోని పలు ప్రాంతాలను సునామీ ముంచెత్తింది. ఆ భూకంపం తర్వాత కూడా కమ్చాట్కా తీరంలో భూ ప్రకంపనలు కొనసాగాయి. 8.8 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం తర్వాతి నుంచి దాదాపు 16 గంటల పాటు రష్యా సమీపంలో 4.4 కంటే ఎక్కువ తీవ్రతతో సుమారు 125 సార్లు ప్రకంపనలు ఏర్పడినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే డేటా వెల్లడించింది. ఆదివారం నాడు కూడా కురిల్ దీవులలో 6.7 తీవ్రతతో భూకంపం ఏర్పడింది. అదే కమ్చాట్కా ద్వీపకల్పంలోని క్రాషెన్నినికోవ్ అగ్నిపర్వతం పేలింది. ఇటీవల సంభవించిన భారీ భూకంపం కారణంగా దాదాపు 600 ఏళ్ల తర్వాత తొలిసారి ఈ అగిపర్వతం బద్దలైనట్టు రష్యా అధికారులు తెలిపారు. ఈ అగ్నిపర్వతం పేలుడు కారణంగా సుమారు 6,000 మీటర్ల మేర బూడిద ఎగిసిపడినట్టు వెల్లడించారు. వరుస భూకంపాలతో కమ్చాట్కా తీర ప్రాంత ప్రజలు భయంతో వణికిపోతున్నారు.
Read Also: ప్రపంచంలో భారీ భూకంపాలు ఎప్పుడొచ్చాయో మీకు తెలుసా?