
చౌటుప్పల్ ఫిబ్రవరి 28, (క్రైమ్ మిర్రర్ న్యూస్ ప్రతినిధి):-యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆకస్మికంగా పర్యటించారు. పట్టణంలోని 16వ వార్డు, 20వ వార్డులలో ఇంటింటికి తిరిగి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీశారు. మంచినీళ్లు సకాలంలో అందుతున్నాయా లేదా అని కాలనీ వాసులను అడిగి తెలుసుకున్నారు. వారానికి ఒకరోజు మాత్రమే మంచినీళ్లు నల్లాల ద్వారా అందింస్తున్నారని కాలనీ వాసులు కలెక్టర్ దృష్టికి తేవడంతో ఆయన స్పందించారు. నీటి ఎద్దడి సమస్య ఏర్పడి బోరు బావులన్నీ ఒట్టిపోయాయని.. మిషన్ భగీరథ నీటిని బోరు బావుల ద్వారా వచ్చే నీటిని రెండు కలిపి నల్లాల ద్వారా నీటి సరఫరా కొనసాగిస్తున్నామని మున్సిపల్ కమిషనర్ కోమటిరెడ్డి నర్సింహా రెడ్డి కలెక్టర్ కు వివరించారు. మంచినీటి సరఫరా లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అనంతరం నిర్మాణ దశలో ఉన్న 100 పడకల సామాజిక ఆసుపత్రి పనులను పరిశీలించారు. పనులు ఇంకా వేగవంతం చేసి సకాలంలో అందుబాటులోకి తీసుకు వస్తే పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించవచ్చని కలెక్టర్ అభిప్రాయపడ్డారు.
ప్రభుత్వ ఆసుపత్రి ఆకస్మిక తనిఖీ
చౌటుప్పల్ లోని ప్రభుత్వ ఆసుపత్రిని కలెక్టర్ శుక్రవారం ఉదయం సందర్శించి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అక్కడి రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. వైద్య పరీక్షలు, మందుల కోసం రోగులను బయటికి పంపిస్తే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ఆసుపత్రి రికార్డులు పరిశీలించిన కలెక్టర్ సాధారణ ప్రసవాల సంఖ్య తక్కువగా ఉండటాన్ని గుర్తించి అక్కడి డాక్టర్లపై సీరియస్ అయ్యారు. వారంలో రెండు రోజులు మాత్రమే సిజేరియన్ ఆపరేషన్లు చేస్తున్నారని తెలుసుకున్న కలెక్టర్ స్పందించారు. అధికారులు తమ తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. సిబ్బంది పనితీరును మార్చుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆసుపత్రి వద్ద ఫిర్యాదు బాక్స్ ఏర్పాటు చేస్తే సిబ్బంది పనితీరు పట్ల ప్రతి సోమవారం రివ్యూ చేస్తామని కలెక్టర్ తెలిపారు.
1. ఏపీలో పింఛన్ల పంపిణీ – స్వల్ప మార్పులు చేసిన ప్రభుత్వం
2. మూడు లక్షల కోట్లు దాటిన బడ్జెట్… పవన్ శాఖలకు భారీ నిధులు?