తెలంగాణ రాజకీయాలన్ని అల్లు అర్జున్ చుట్టే తిరుగుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డికి కౌంటర్ గా పుష్ప ప్రెస్ మీట్ పెట్టడాన్ని సీరియస్ గా తీసుకున్న కాంగ్రెస్ నేతలు బన్నీని ఏ రేంజ్ లో టార్గెట్ చేస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు రెచ్చిపోతున్నారు. అల్లు అర్జున్ బెయిల్ రద్దు చేసి వెంటనే అరెస్ట్ చేసి జైలుకు పంపించాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా మంత్రి సీతక్క తీవ్ర స్థాయిలో పుష్పను కడిగిపారేశారు.
రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులను మనకు బోధించే జై భీం లాంటి సినిమాకు నేషనల్ అవార్డు రాలేదు.. అలాంటి సినిమాలకు కేంద్ర ప్రోత్సాహకాలు లేవు.. కానీ ఒక స్మగ్లర్, పోలీసును బట్టలూడదీసి నిలబెడితే నేషనల్ అవార్డు ఇచ్చారు.. ఇది దేనికి సంకేతమని మంత్రి సీతక్క ప్రశ్నించారు. ఒక స్మగ్లర్‌ను హీరో చేశారు.. పోలీసును విలన్ చేశారని మండిపడ్డారు. జై భీమ్ సినిమా మన హక్కులను మనకు చూపించింది.. మనకు ప్రేరణగా నిలిచింది..అలాంటి సినిమాను ప్రోత్సహించ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి సినిమాకు అవార్డులు రాలేదు కాని.. చట్టబద్ధంగా డ్యూటీలో ఉండే పోలీసు అధికారులను పోలీస్ స్టేషన్ లోనే ఒక స్మగ్లర్ బట్టలిప్పేసి చిత్రానికి కేంద్రం నుంచి అవార్డులు వస్తున్నాయని సీతక్క విమర్శించారు.
సినిమాలకు మేము వ్యతిరేకం కాదు.. సందేశాత్మక చిత్రాలకు అవార్డులు ఇవ్వాలి.. స్మగ్లింగ్ విరుద్ధంగా ఇతి వృతంగా వచ్చే సినిమాలకు అవార్డులు ఇస్తే ఎలా అని మంత్రి సీతక్క ప్రశ్నించారు. నేరాలను చట్టబద్ధంగా కట్టడి చేసే పోలీసు అధికారి ఎలా జీరో అవుతాడని అన్నారు. సమాజాన్ని ఒక ఉన్నతమైన సన్మార్గంలో తీసుకెళ్లే లక్షణాలతో సినిమాలు ఉండాలన్నారు. ఇతరుల గౌరవాన్ని కాపాడే సినిమాలు తీస్తే సమాజం ఇంకా సన్మార్గంలో నడుస్తుందని చెప్పారు. చట్టబద్ధంగా రాజ్యాంగం ఇచ్చిన వ్యవస్థలను అంతా గౌరవించాలని.. భవిష్యత్ తరాలకు మనం ఏమి నేర్పిస్తున్నామన్నదే ముఖ్యమని మంత్రి సీతక్క అన్నారు.