
భూ కబ్జాలు, మోసాలు, బెదిరింపులకు పాల్పడితే జైలే దిక్కని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వార్నింగ్ ఇచ్చారు. భూ సమస్య పరిష్కారమయ్యే వరకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. గత ప్రభుత్వం వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసిందని.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌తో మన భూమికి దిక్కులేకుండా చేసే పరిస్థితిని తీసుకొచ్చారని చంద్రబాబు అన్నారు. పాస్‌పుస్తకంపై క్యూఆర్ కోడ్, జియో ట్యాగింగ్‌తో ఎప్పటికప్పుడు రికార్డులను పరిశీలించుకునే అవకాశం కల్పిస్తామని తెలిపారు.
కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని ఈడుపుగళ్లు గ్రామంలో జరిగిన రెవెన్యూ సదస్సులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ప్రజల నుంచి రెవెన్యూ సమస్యలకు సంబంధించి పిటిషన్లను స్వయంగా స్వీకరించారు. 57 శాతం ఓట్లతో గొప్ప మెజారిటీతో గెలిపించి ఎన్‌డీఏ ప్రభుత్వంపై మీరు పెట్టుకున్న ఆశలను నెరవేర్చేందుకు ఆర్నెళ్లుగా కష్టపడుతున్నామని.. ఇంకా కష్టపడతామని, ప్రతి సమస్యకు పరిష్కారం చూపించాలనేది మా ఆలోచన అని ముఖ్యమంత్రి అన్నారు. గత ప్రభుత్వం భూకబ్జాలతో మొదలుపెట్టి వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసిందని.. విధ్వసం సృష్టించి మన జీవితాలను అంధకారంలోకి నెట్టారని అన్నారు.
భూమి అనేది ప్రజల భవిష్యత్తుకు సంబంధించిన అంశమని.. ఒక గజమైనా, సెంటు అయినా, ఎకరా అయినా ప్రాణంతో సమానమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. సర్వస్వంగా భావించే భూమిని గత ప్రభుత్వంలో అడ్డగోలుగా లాక్కున్నారని అన్నారు. భూమికి, మనకు ఉన్న బంధాన్ని తెంచేయాలని చూశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చారు. ఈ యాక్ట్‌తో ఆనాటి ముఖ్యమంత్రి గుమస్తాలను పెట్టుకొని మీ భూమిపై పెత్తనం చేసే పరిస్థితికి వచ్చారన్నారు. వారసత్వంగా వచ్చిన లేదా కష్టపడి భూమిని కొనుక్కొంటే దానిపైన ఆయన బొమ్మ వేసుకున్నారు. రాజముద్ర ఉండాల్సిన చోట ఆయన సొంత బొమ్మ వేసుకున్నారు. మనదగ్గర బ్రిటిష్ కాలం నుంచి చాలా పటిష్టంగా రికార్డులు ఉన్నాయి. నిజాం పాలనతో పాటు కొందరు హైదరాబాద్ నుంచి పాకిస్తాన్ వెళ్లిపోవడం వంటి కారణాల వల్ల తెలంగాణలో రికార్డులకు సంబంధించి కొన్ని సమస్యలు ఉంటాయి. కానీ.. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం బ్రిటిష్‌వారు చాలా పకడ్బందీ రికార్డులను నిర్వహించారు. జమాబందీలో మనం డబ్బులుకట్టి మన భూమి మన పేరుతో ఉందో లేదో ఏటా చూసుకునేవాళ్లం. అలాంటి మంచి వ్యవస్థ ఉన్న స్థితి నుంచి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌తో మన భూమి మనకు లేకుండా చేసే స్థితికి తీసుకొచ్చారు. అందుకే చెప్పిన మాట ప్రకారం మొదటి క్యాబినెట్ సమావేశంలోనే చర్చించి ఆ చట్టాన్ని రద్దు చేశామని ముఖ్యమంత్రి వివరించారు.
భూముల సర్వే పేరుతో విధ్వంసం సృష్టించి.. రాళ్లపై ఫొటోలు వేసుకున్నారని.. ఆ బొమ్మలు తీయడానికి రూ. 12 కోట్లు అయిందని ముఖ్యమంత్రి వివరించారు. మొన్నటివరకు మీరు భయంభయంగా బతికారని.. భూమిని కబ్జా చేసినా, 22ఏలో పెట్టినా, భూమి మీది కాదని చెప్పినా మాట్లాడాలంటే భయపడే పరిస్థితికి వచ్చారు. కానీ.. ఇప్పుడు మీరు స్వేచ్ఛగా ఇక్కడికి వచ్చి, నేరుగా అడిగే అధికారం ఎన్‌డీఏ ప్రభుత్వం మీకు ఇచ్చింది. దాదాపు అన్ని రెవెన్యూ గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు పెడుతున్నాం. ఈ సదస్సుల ద్వారా 95,263 పిటిషన్లు వచ్చాయి. డిసెంబర్ 6న ప్రారంభించి జనవరి 8 వరకు రెవెన్యూ సదస్సులు పెడుతున్నాం. దాదాపు 3 లక్షల మంది ఈ సదస్సులకు హాజరయ్యారు. ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించి మీ భూమి మీకు ఇచ్చే బాధ్యత మాది. ఇందులో ఎలాంటి అనుమానం లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ యాక్ట్ – 2024 చట్టం తీసుకొచ్చామని.. ఎవరైనా వేరేవాళ్ల భూమిని కబ్జాచేస్తే అలాంటి వారిపై చాలా కఠిన చర్యలు ఉంటాయని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఎవరైనా మోసం చేసి భూమిని లాక్కున్నా, బలవంతంగా బెదిరించి లాక్కున్నా కొత్త చట్టం వర్తిస్తుందని, జైల్లో పెట్టే అధికారం ఇచ్చాం. ఎవరైనా ఒకసారి తప్పుచేస్తే పీడీ యాక్టు కింద జైలుకు పంపించే హక్కును చట్టం కింద తీసుకొచ్చాం. మరోవైపు ఎక్కడ భూకబ్జా జరిగినా.. భూకబ్జాకు పాల్పడినా వారిని జైల్లో పెట్టడమే కాకుండా భూమి విలువ మేరకు జరిమానా కూడా వేస్తున్నాం. ఎవరైనా ఒక సెంటు భూమి కబ్జా చేసినా ఖబడ్దార్.. తాటతీస్తాం. ఎవరినీ వదిలిపెట్టం. ఎవరైనా వేరేవారి భూమిపై కన్నేస్తే జైలు కనిపించాలని చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు.భూసమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని.. ఒకసారి రికార్డు అప్‌డేట్ అయిన తర్వాత పట్టాదారు పాస్ పుస్తకాలిస్తామని తెలిపారు. క్యూఆర్ కోడ్ కూడా పెట్టి, జియో ట్యాగింగ్ కూడా చేస్తామని వివరించారు. ఎప్పటికప్పుడు రికార్డులను పరిశీలించుకునే అవకాశం లభిస్తుందన్నారు. నిర్దిష్ట కాలపరిమితి పెట్టుకొని అన్నింటినీ పూర్తిచేస్తామని తెలిపారు.