తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీజేపీ గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన కామెంట్స్ చేశారు. సీఎం రేవంత్ ను ప్రశంసలతో ముంచెత్తారు. ధర్మం తెలిసిన ముఖ్యమంత్రి అని రాజాసింగ్ అభినందించారు. హైదరాబాద్ లో వినాయక నిమజ్జన ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయన్నారు ఎమ్మెల్యే రాజాసింగ్. పోలీసులు, మున్సిపల్ సిబ్బంది పని తీరు బాగుందన్నారు. ఎక్కడా భక్తులకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకున్నారని బీజేపీ ఎమ్మెల్యే కొనియాడారు.
సీఎం రేవంత్ రెడ్డి ఉత్సవాల ఏర్పాట్ల నుంచి నిమజ్జనం వరకు అన్నింటిని ఎప్పటికప్పుడు సమీక్షించారని ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు. గతంలో ఏ సీఎం చేయని విధంగా ఖైరతాబాద్ గణేష్ నిమజ్జన ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ధర్మం తెలిసిన వారు కాబట్టే స్వయంగా ట్యాంక్ బండ్ కు వచ్చి ఏర్పాట్లు చూశారని రాజాసింగ్ అభినందించారు.
Read More : రెండు రోజుల్లో ప్రతి ఇంటికి 25 వేల రూపాయలు.. సీఎం సంచలనం
ఖైరతాబాద్ బడా గణేషును నిమజ్జనం చేసే క్రేన్ నెంబర్ దగ్గరకు స్వయంగా వచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. దాదాపు గంటసేపు అక్కడే ఉన్నారు. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, మేయర్ గద్వాల విజయలక్ష్మి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలితో నిమజ్జన ఏర్పాట్లపై చర్చించారు. రాష్ట్రం హోంశాఖ మంత్రిగా కూడా సీఎం రేవంతే ఉన్నారు. దీంతో ఆయనే స్వయంగా రంగంలోకి దిగారు..