తెలంగాణ

మహిళలకు అర్దరాత్రి పోలీసుల వేధింపులు..రేవంత్‌కు పుట్టగతులుండవ్!

లగచర్లలో జరిగిన సంఘటనకు రాజకీయ రంగు పులిమి పేదల భూములు గుంజుకునే కుట్రను రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. తమ భూములు కోల్పోతామని ఆవేదనతో రైతులు నిరసన తెలిపితే వాళ్లపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి అమానుషంగా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు అరెస్ట్ చేసిన రైతుల కుటుంబాలకు చెందిన గిరిజన మహిళలు తెలంగాణ భవన్ లో కేటీఆర్ ను కలిసి తమ గోడు చెప్పుకున్నారు. తమ ఇంట్లో మగవారిపై ఎంత కర్కషంగా వ్యవహరించారో చెబుతూ కంటతడి పెట్టారు. దాడితో సంబంధం లేకపోయినా కూడా తన భర్తను విపరీతంగా కొట్టి తీసుకెళ్లారని జ్యోతి అనే గర్భిణీ మహిళ పోలీసుల దాడిని కేటీఆర్ కు వివరిస్తూ కంటతడి పెట్టారు.

తమ భూములు తీసుకుంటామని దాదాపు పది నెలలుగా ఇబ్బంది పెడుతున్నారని…తమకు ఆ భూములే ఆధారమన్నారు. తమవారిని తీవ్రంగా కొట్టటంతో వాళ్లు నడవలేని పరిస్థితిలో ఉన్నారంటూ అవేదన వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో భూములు తీసుకుంటామని మమ్మల్ని బెదిరిస్తున్నారని మా ఆధారం పోతే ఎలా బతకాలని వారు ఆందోళన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ వాళ్లే ఈ దాడికి కుట్ర చేశారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సహా కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలపై ఈ సందర్భంగా కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ గిరిజన మహిళలను చూస్తుంటే ఎవరో చెబితే దాడి చేసే వారిలా కనిపిస్తున్నారా అంటూ ప్రశ్నించారు.

ఫార్మా విలేజ్ వస్తే ఏం ప్రయోజనం కూడా వారికి చెప్పే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేయలేదని కేటీఆర్ అన్నారు. జానెడు భూమి కోసం పోరాటం చేస్తున్న రైతుల పై ఇంత పాశవికంగా దాడి చేయటమేమిటని కేటీఆర్ ప్రశ్నించారు. గిరిజన రైతుల కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. పోలీసులు అరెస్ట్ చేసిన వారి కుటుంబ సభ్యులను విడిపించే వరకు పూర్తి గా బీఆర్ఎస్ పార్టీ తోడుగా ఉంటుందని హామీ ఇచ్చారు. గర్భిణీ మహిళ జ్యోతికి వైద్య సాయం అందిస్తామన్నారు. లగచర్ల లో రైతులపై పోలీసులు అమానుష దాడిని జాతీయ మానవహక్కుల కమిషన్, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సుమాటో గా స్వీకరించి విచారణ జరపాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఈ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలను ఎదుర్కొనేందుకు ప్రజాసంఘాలు, గిరిజన, దళిత సంఘాలు, మహిళా సంఘాలు ముందుకు రావాలన్నారు. అన్ని పార్టీలు కలిసి ప్రభుత్వంపై పోరాటం చేయాల్సిన అవసరముందని చెప్పారు. లగచర్ల ఘటనను స్థానిక ఎంపీగా ఉన్న డీకే అరుణ కూడా కేంద్రం దృష్టికి తీసుకెళ్లి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button