క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ కనుమరుగు కాబోతోందని కొన్ని రోజులుగా ప్రచారం సాగుతోంది. బీజేపీలో గులాబీ పార్టీ విలీనం అవుతుందంటూ ఇటీవల ఓ సీనియర్ జర్నలిస్ట్ ఇచ్చిన కథనం తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు రేపింది.అయితే విలీన వార్తలను ఖండించారు కేటీఆర్, హరీష్ రావు. తమకు కష్టాలు కొత్త కావని చెప్పారు. నాలుగేళ్ల తర్వాత తామే అధికారంలోకి వస్తామని తెలిపారు. అయితే తాజాగా బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్ కు సంబంధించి మరో ప్రచారం తెరపైకి వచ్చింది.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా చేసిన కామెంట్లతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కాదు..పొత్తు ఉండనుంది అనే తరహాలో కామెంట్స్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఏ కూటమిలోనూ లేని పార్టీలను ప్రజలు ఆదరించలేదని కేటీఆర్ అనడం ఇందుకు బలం చేకూర్చుతోంది.
బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక ఎమ్మెల్యేలు, కీలక నేతలు కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఇంకొంతమంది చేరేందుకు రెడీగా ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ ఒంటరిగా మనగలగడం అసాధ్యమని పలువురు నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెప్తున్నారు. అయితే, పార్టీని వరుసగా నేతలు వీడుతోన్న నేపథ్యంలో వారిని కాపాడుకునేందుకు భవిష్యత్ లో జాతీయ పార్టీ బీజేపీతో పొత్తు ఉంటుందని పరోక్షంగా కేటీఆర్ సంకేతాలు ఇస్తున్నారా? అనే చర్చ జరుగుతోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ విలీనం అంటూ ప్రచారం జరుగుతోన్న తరుణంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు.. విలీనం కాదు.. పొత్తుకు సిద్దమని సంకేతాలు పంపినట్లు ఉందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.