
రియల్ ఎస్టేట్ పడిపోవడంతో అప్పులు పెరిగిపోయి బిల్డర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలంగాణలో భయాందోళనకు కారణమైంది. చాలా మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బిల్డర్లు, కాంట్రాక్టర్ల పరిస్థితి ఇలానే ఉందనే ఆందోళన వ్యక్తమలుతోంది. సూసైడ్ చేసుకున్న బిల్డర్ వేణుగోపాల్ రెడ్డి కుటుంబ సభ్యులు తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. తమ చావుకి కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డే కారణమంటున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రియల్ ఎస్టేట్ కొంచెం డౌన్ అయిందని.. హైడ్రా తీసుకురావడంతో రియల్ ఎస్టేట్ పూర్తిగా పడిపోయిందని బిల్డర్ వేణుగోపాల్ రెడ్డి సోదరి చెప్పారు. తన అన్న చావుకి ఒకరకంగా రేవంత్ రెడ్డి కూడా కారణమే అన్నారు. కట్టిన అపార్ట్ మెంట్స్, ఫ్లాట్స్ అమ్ముడు పోక, బ్యాంకులు బిల్డర్స్ కి లోన్లు ఇవ్వక తన అన్న డిప్రెషన్ లోకి వెళ్ళాడని తెలిపారు. తన అన్నయ్య ఆత్మహత్య చేసుకునే కొద్ది రోజుల ముందు సీఎం రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ నాయకుడు మైనంపల్లి హనుమంతరావుతో పాటు మరికొంత మంది కాంగ్రెస్ నేతలకు ఎనిమిది లేఖలు రాశాడని బిల్డర్ వేణుగోపాల్ రెడ్డి సోదరి వెల్లడించారు.
చిన్న బిల్డర్లను బ్రతికించండి. రియల్ ఎస్టేట్ పుంజుకోవడానికి సరైన నిర్ణయాలు తీసుకోండని లేఖలో విన్నవించారని చెప్పారు. హైడ్రా విషయంలో కూడా కొన్ని మార్పులు చేయండి అంటూ లేఖలు రాశాడు.. కానీ ఎవరూ పట్టించుకోలేదని బిల్డర్ సోదరి తెలిపారు.తమ కుటుంబం ఈరోజు రోడ్డున పడిపోయిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఆత్మహత్య చేసుకున్న బిల్డర్ వేణుగోపాల్ రెడ్డి సోదరి.