జాతీయంతెలంగాణ

జైలులోనే ఎమ్మెల్సీ కవిత.. సుప్రీంకోర్టు బిగ్ షాక్

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : ఢిల్లీ లిక్కర్‌ కేసులో ఎమ్మెల్సీ కవిత బెయిల్‌ పిటిషన్‌ మరోసారి వాయిదా పడింది. ఈనెల 27కు సుప్రీం కోర్టు వాయిదా వేసింది. కౌంటర్‌ దాఖలు చేయడానికి ఈడీకి సమయమిచ్చింది. దాంతో బెయిల్ పిటిషన్ వచ్చే మంగళవారానికి వాయిదాపడింది. జస్టీస్ బీఆర్ గవాయి, జస్టీస్ విశ్వనాథ్ ధర్మాసనం బెయిల్‌ పిటిషన్‌పై విచారించింది. ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిలు ఇవ్వాలని కోరుతూ కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా.. జూలై 1న న్యాయస్థానం బెయిల్‌ ఇచ్చేందుకు నిరాకరించింది. దాన్ని సవాలు చేస్తూ ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇదే కేసులో మనీష్‌ సిసోడియాకు బెయిల్‌ దక్కడంతో కవితకు ఈసారి తప్పకుండా ఊరట దక్కుతుందని BRS నేతలు ఆశ పడ్డారు కానీ బెయిల్‌ పిటిషన్‌ను ఈనెల 27కు సుప్రీం కోర్టు వాయిదా వేసింది.

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఇటీవలే ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీస్ సిసోడియాకు బెయిల్ వచ్చింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసు విచారణలో గత అక్టోబర్ నుంచి పురోగతే లేదని కామెంట్ చేసింది. న్యాయాన్ని రక్షించాల్సిన బాధ్యత తమపై ఉందని ధర్మాసనం చెప్పింది. సుప్రీంకోర్టు ధర్మాసనం కామెంట్ల నేపథ్యంలో ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితకు బెయిల్ వస్తుందనే ప్రచారం సాగుతోంది.
ఇటీవల కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీలో నాలుగు రోజుల పాటు మకాం వేసి న్యాయవాదులతో చర్చలు జరిపారు. ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. కవిత త్వరలోనే జైలు నుంచి బయటికి వస్తుందని చెప్పారు. కేటీఆర్ కామెంట్లు.. కేసులో తాజాగా జరుగుతున్న పరిణామాలతో ఎమ్మెల్సీ కవితకు బెయిల్ వస్తుందని అంతా అనుకున్నారు. కవితకు బెయిల్ వస్తుందన్న ఆశతో మాజీ మంత్రులువేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ తో పాటు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఢిల్లీ వెళ్లారు.

Read More : కవితకు బెయిల్ ఇప్పిస్తున్న సీఎం రేవంత్ లాయర్!

ఢిల్లీ లిక్కర్ కేసులో మార్చి 15న కవితను హైదరాబాద్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అరెస్టు చేసి మార్చి 16న ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులో హాజరు పరిచింది. కోర్టు అనుమతితో రెండు విడతలుగా 10 రోజులు ఈడీ కస్టడీలోకి తీసుకుని కవితను విచారించింది. ఆ తర్వాత కవితకు 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధించడంలో మార్చి 26న తిహాడ్‌ జైలుకు తరలించారు. ఇంతలోనే సీబీఐ రంగంలోకి దిగి కవిత తిహాడ్‌ జైలులో ఉండగానే అరెస్టు చేసింది.

Back to top button