తెలంగాణ

గ్రూప్-1 మెయిన్స్ పరీక్షకు 28 శాతం మంది డుమ్మా.. అధికారులు షాక్

కోర్టు కేసులు, ఆందోళన మధ్య పరీక్షా ఉంటుందా ఉండదా అన్న పరిస్థితుల్లో సుప్రీంకోర్టు ఓకే చెప్పడంతో తెలంగాణలో గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలు మొదలయ్యాయి. తొలి రోజు ఇంగ్లీషు పరీక్ష జరిగింది. అయితే గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షకు ఏకంగా 28 శాతం మంది హాజరు కాలేదు. 31,383 మంది అభ్యర్థులు ప్రిలిమ్స్‌లో అర్హత సాధించారు. వీళ్ల కోసం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల కోసం మొత్తం 46 పరీక్ష కేంద్రాలను టీజీపీఎస్సీ ఏర్పాటు చేసింది. తొలి రోజు జరిగిన గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షకు 22 వేల 744 మంది మాత్రమే హాజరయ్యారు. హాజరు శాతం 72.4శాతంగా నమోదైంది. అంటే దాదాపు 28 శాతం మంది అభ్యర్థులు తొలి రోజు గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షకు హాజరు కాలేదు.

గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షకు 28 శాతం మంది డుమ్మా కొట్టడం చర్చగా మారింది. మాములుగా ప్రిలిమ్స్ కు ఎక్కువ మంది అప్లయ్ చేసిన హాజరు కారు. కాని కష్టపడి చదవి ప్రిలిమ్స్ లో అర్హత సాధించిన అభ్యర్థులు.. ఇంత పెద్ద సంఖ్యలో ఎందుకు హాజరు కాలేదన్నదని తెలియడం లేదు. వరుసగా వివాదాలు.. పరీక్షా జరుగుతుందా లేదా అన్న అనుమానాల వల్లే ఎక్కువ మంది హాజరు కాలేదని అభిప్రాయం వ్యక్తమవుతోంది.

రంగారెడ్డి జిల్లాలో 11 గ్రూప్ 1 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 8,011 మంది అభ్యర్థులకుగాను 5,854 మంది హాజరు కాగా.. 2,157 ఆబ్సెంట్ అయ్యారు. ఇబ్రహీంపట్నంలోని గురునానక్‌ కళాశాలలో ఓ అభ్యర్థి పరీక్ష రాసేందుకు రెండు నిమిషాలు ఆలస్యంగా రావడంతో అధికారులు లోపలికి అనుమతించలేదు. మొయినాబాద్‌లో కేజీ రెడ్డి ఇంజినీరింగ్‌ కాలేజీలోనూ ఓ అభ్యర్థి ఆలస్యంగా రావడంతో ఆపేశారు. దీంతో వారు నిరాశతో వెనుదిరిగారు.

గ్రూప్ 1 పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. అన్ని కేంద్రాల వద్ద బీఎన్‌ఎస్‌ఎస్‌ 163 సెక్షన్‌ విధించారు. ప్రతి కేంద్రం పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి ఇచ్చారు. ఈనెల 27 వరకు వివిధ సబ్జెక్టుల ప్రకారం పరీక్షలు జరుగనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button