
తెలంగాణలో గురుకులాల పరిస్థితి దారుణంగా తయారైంది. ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో విద్యార్థులకు సరిగా తిండి పెట్టడం లేదు. నాసిరకం భోజనంతో పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నారు. రాష్ట్రంలో నిత్యం ఏదో ఒక చోట విద్యార్థులు కలుషిత ఆహారం తిని హాస్పిటల్ పాలవుతున్నారు. తాజాగా తమ తమ సమస్యలు కలెక్టర్‌కు చెప్పుకునేందుకు ఏకంగా గురుకులం గోడ దూకారు 70 మంది గురుకుల విద్యార్థులు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన వచ్చి విద్యార్థులను..మధ్యలో అడ్డుకుని తిరిగి గురుకులానికి పంపించారు.
వనపర్తి జిల్లా చిట్యాలలోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల పాఠశాలలో తమ సమస్యలు కలెక్టర్‌కు చెప్పుకునేందుకు కాంపౌండ్ వాల్ దూకి పంట పొలాల మీదుగా పరుగులు తీశారు 70 మంది 10వ తరగతి విద్యార్థులు.ప్రిన్సిపాల్ తమను బూతులు తిడుతున్నాడని, మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని, సిబ్బందితో కలిసి విద్యార్థుల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నాడని, వినతి పత్రంలో పేర్కొన్నారు విద్యార్థులు. వినతి పత్రం కలెక్టర్‌కు అందించేందుకు గోడ దూకి కలెక్టరేట్ వైపు పరుగులు తీస్తుండగా, అడ్డుకుని తిరిగి పాఠశాలకు పంపించేశారు పోలీసులు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. విద్యార్థుల సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువెళతామని పోలీసులు చెబుతున్నారు.