కొడంగల్ ఫార్మా కంపెనీ మంటలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. లగచెర్లలో కలెక్టర్ పై జరిగిన దాడి ఘటనపై కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కేటీఆర్ కు మాస్ వార్నింగ్ ఇచ్చారు తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్.అధికారులపై దాడి చేయడం దారుణమన్న మహేష్ గౌడ్.. కేటీఆర్‌కు శిక్ష తప్పదని హెచ్చరించారు. లెక్కలు తీస్తే దాడికి కుట్ర చేసిన వాళ్ల బొక్కలు విరుగుతాయని అన్నారు.
అధికారం పోయిందనే అక్కసు కేటీఆర్‌లో అణువణువూ కనిపిస్తోందని.. ప్రభుత్వ కార్యక్రమాలను అడ్డుకోవడమే ఎజెండాగా బిఆర్ఎస్ పార్టీ పనిచేస్తుందని మహేష్ గౌడ్ మండిపడ్డారు. భూమలు లేనివారు కలెక్టర్ పై దాడి చేశాని.. ముమ్మాటికీ ఇది కుట్రేనని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ భారీ కుట్రలు చేస్తుందని.. పక్కా ప్లాన్ ప్రకారం దాడి జరిగిందన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణను బిఆర్ఎస్ అడ్డుకుంటోందని మహేష్ గౌడ్ మండిపడ్డారు.
కలెక్టర్ పై దాడికి సంబంధించి కేటీఆర్ ఫోన్ కాల్ సంభాషణలు ఉన్నాయని పోలీసులు నిర్దారించారని టీపీసీసీ చీఫ్ చెప్పారు. ప్రభుత్వం అధికారులపై దాడి ఘటనలో మొదటి ముద్దాయి కేటీఆరే అన్నారు. ఈ ఫార్ములాలో డబ్బులు చేతులు మారాయన్నారు. ప్రభుత్వ సొమ్మును కేటీఆర్ తన వారికి కట్టబెట్టారని ఆయన ఆరోపించారు. దాడి ఘటనలో ఎవరు ఉన్నా వెంటనే అరెస్టు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.