* ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు తర్వాత తీవ్ర నిర్ణయం
* బొత్స, ధర్మానకు హస్తం హై కమాండ్ ఫోన్?
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత జగన్మోహన్ రెడ్డి తరచు రాజధానుల స్టాండ్స్ మారుస్తున్నారు. ఇది ఎంత మాత్రం ఆ పార్టీ నేతలకు మింగుడు పడడం లేదు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర నేతలు అయితే అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. ఇలా అయితే రాజకీయాలు చేయలేమని తేల్చి చెబుతున్నారు. ప్రధానంగా సీనియర్ నేతలుగా ఉన్న బొత్స, ధర్మాన ప్రసాదరావు లాంటి నేతలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత వీరు తీవ్ర నిర్ణయాలు దిశగా అడుగులు వేస్తారని ప్రచారం సాగుతోంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటే మాత్రం వీరు ఆ పార్టీ వైపు అడుగులు వేయడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డి చర్యలతో విసిగి వేసారి పోయిన ఈ నేతలు ఆయనతోనే కొనసాగితే రాజకీయంగా డ్యామేజ్ పడడం ఖాయమని ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
కాంగ్రెస్ అనుకూల పవనాలు..
దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. పశ్చిమ బెంగాల్, అస్సాం,తమిళనాడు, కేరళ, పాండిచ్చేరి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే కేరళ తో పాటు తమిళనాడులో కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వస్తే మాత్రం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అనుకూల పవనాలు వీస్తాయి. పశ్చిమ బెంగాల్లో మరోసారి మమతా బెనర్జీ గెలుపొందితే బిజెపి వ్యతిరేక పవనాలు ఖాయం. అందుకే ఈ మూడు రాష్ట్రాల ఫలితాలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కీలకం. సానుకూల ఫలితాలు వస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ ఏపీపై దృష్టి పెట్టే అవకాశం ఉంది. కేరళలో కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ గా ప్రచారం చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. అక్కడ కానీ కాంగ్రెస్ గెలుపొందితే రేవంత్ తదుపరి టార్గెట్ ఆంధ్ర ప్రదేశ్. మరోవైపు తమిళనాడులో డీఎంకే నేతృత్వంలోని కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. అంటే దక్షిణాది రాష్ట్రాల్లో ఒక్క ఏపీ తప్ప అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారం చేపడితే ఆ ప్రభావం ఏపీ పై ఉంటుంది.
అధినేత వైఖరి నచ్చక..
ప్రస్తుతం ఏపీలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు బాగుండడం లేదు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ పొందుకుంటే వైసీపీలో సీనియర్లుగా ఉన్న ఒక్కప్పటి కాంగ్రెస్ నేతలు మనసు మార్చుకోవడం ఖాయం. అందుకే ఇప్పుడు ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల కోసం వైసీపీ సీనియర్ నేతలు ఎదురుచూస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది. కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ సైతం వైసీపీ సీనియర్లకు టచ్ లోకి వచ్చినట్లు టాక్ నడుస్తోంది. పైగా కాంగ్రెస్ పార్టీలో ఉండే స్వేచ్ఛ గురించి వారికి తెలుసు. స్వతంత్రంగా వ్యవహరించవచ్చు కూడా. ముఖ్యంగా విశాఖను పాలన రాజధానిగా ప్రకటించిన జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు మావిగన్ అంటున్నారు. అయితే విశాఖపట్నం రాజధానిగా గొప్పగా ప్రచారం చేసుకున్న ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ ఇప్పుడు జగన్ వైఖరి పై ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పుంజుకుంటే.. వారు ఆ పార్టీలో చేరడం ఖాయమన్న ప్రచారం పొలిటికల్ వర్గాల్లో ఉంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.
