
సంగారెడ్డి జిల్లా నిజాంపేట్ మండలం మాణిక్ నాయక్ తండాలో చోటుచేసుకున్న ఘటన స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ప్రియుడి ఇంటి ముందు యువతి మృతదేహాన్ని ఉంచి కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టిన ఘటన శనివారం రాత్రి సంచలనంగా మారింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిర్గాపూర్ మండలం కడపల్ విఠల్ నాయక్ తండాకు చెందిన వడితే కావేరి 23 ఏళ్ల యువతి.. నిజాంపేట్ మండలం మాణిక్ నాయక్ తండాకు చెందిన సభావత్ శ్రీకాంత్‌తో కొంతకాలంగా ప్రేమ సంబంధం కొనసాగింది.
ఇరువురు తమ ప్రేమ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేసి వివాహం చేసుకోవాలని కోరారు. అయితే కుటుంబ సభ్యులు ఈ పెళ్లికి అంగీకరించకపోవడంతో ఇద్దరూ సొంత గ్రామాలను విడిచి హైదరాబాద్ వెళ్లారు. ఎల్బీనగర్ ప్రాంతంలో సహజీవనం ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో వారి మధ్య తరచూ విభేదాలు చోటుచేసుకున్నాయని సమాచారం. ఈ విభేదాల నేపథ్యంలో వడితే కావేరి ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు తొలుత సమాచారం వెలువడింది.
అయితే యువతి తల్లిదండ్రులు మాత్రం ఇది ఆత్మహత్య కాదని.. ప్రియుడే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని శనివారం రాత్రి స్వగ్రామానికి తీసుకువెళ్లే క్రమంలో మాణిక్ నాయక్ తండాలోని శ్రీకాంత్ ఇంటి ముందు ఉంచి యువతి బంధువులు తీవ్ర ఆందోళనకు దిగారు.
ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరువర్గాల మధ్య ఘర్షణలు తలెత్తకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. పరిస్థితి అదుపు తప్పకుండా ఉండేందుకు కల్హేర్ పోలీసులు ప్రత్యేక బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. అదే సమయంలో యువతి, యువకుడి కుటుంబాల మధ్య రాజీ కుదిర్చేందుకు గ్రామ పెద్దలు, పెద్దమనుషులు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. పోలీసులు మాత్రం అన్ని కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నామని, పోస్ట్‌మార్టం నివేదికతో పాటు ఆధారాల ఆధారంగా నిజానిజాలు వెలుగులోకి తెస్తామని తెలిపారు.
ALSO READ: (VIRAL VIDEO): 2 నెలలుగా బాలిక ముక్కులోనే బతికున్న జలగ.. ఎలా బయటకు తీశారో చూడండి





