
క్రైమ్ మిర్రర్, వలిగొండ : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు కొలతలు లేకుండా రోజుకు 600 రూపాయలకు కూలీని చెల్లించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి సిర్పంగి స్వామి డిమాండ్ చేశారు. మంగళవారం మండల పరిధిలోని నాగారం గ్రామంలో ఉపాధి హామీ పనుల వద్ద కూలీల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేరళ వామపక్ష ప్రభుత్వం కొలతలు లేకుండా రోజు కూలీ 600 రూపాయలు ఇస్తూ కూలీలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఉపాధి హామీ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తుందని కేరళ విధానాన్ని తెలంగాణలో అమలు చేయాలని డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి నిధులను సక్రమంగా కేటాయించకుండా,కేటాయించిన నిధులను పూర్తిస్థాయిలో ఖర్చు చేయకుండా పేదలకు ఉపాధిని కల్పించే ఈ పథకాన్ని క్రమక్రమంగా నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తుందని కూలీలందరూ ఈ పథకం రక్షణ కోసం ఈనెల 20వ తేదీన జరిగే దేశవ్యాప్త సమ్మెలో భాగస్వాములు కావాలని పథకాన్ని రక్షించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కేవీపీస్ మండల సహాయ కార్యదర్శి గొల్ల శివ,వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఏర్పుల పాండు, చిప్పలపల్లి శంకరయ్య,బల్లేపు స్వామి, పర్వతం గట్టు,గోళ్ళ వెంకటమ్మ, ఏర్పుల సబిత, పార్వతమ్మ తదితరులు పాల్గొన్నారు.