
అసెంబ్లీలో వైసీపీ సభ్యుల తీరుపై మరోసారి అసహనం వ్యక్తం చేశారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు. కొందరు సభ్యులు సభకు హాజరుకావడంలేదని.. దొంగచాటుగా వచ్చి సంతకాలు మాత్రం పెట్టి వెళ్లిపోతున్నారని ఆగ్రహించారు. ఈ సభలో దురదృష్టవశాత్తు 25 ప్రశ్నలకు సమాధానం లభించలేదని చెప్పారాయన. ప్రతిపక్షానికి చెందిన సభ్యులు ప్రశ్నలు వేస్తున్నారే గానీ.. సమాధానం వినేందుకు సభకు రావడంలేదని అన్నారు. ప్రశ్నలు పంపుతున్నారే కానీ… ఆ ప్రశ్నలు అడిగిన సభ్యులు మాత్రం సభలో ఉండటంలేదన్నారు. దీని వల్ల… కొంత సభా సమయం వృధా అవుతుందని… మరో ఇద్దరు సభ్యులు ప్రశ్నలు అడిగే అవకాశం కోల్పోతున్నారని చెప్పారు. ఈ తీరు చాలా దురదృష్టకరమని ఫైరయ్యారు స్పీకర్.
సభకు ఎన్నికైన సభ్యులు గౌరవప్రదంగా సభకు రావాలే గానీ.. దొంగల్లా ప్రవర్తించడం ఏంటని ఘాటుగా స్పందించారు. శాసనసభలోకి వెళ్లి ప్రజాసమస్యలపై మాట్లాడమనే వాళ్లను ప్రజలు ఎన్నుకున్నారని చెప్పారు. కానీ.. ఇక్కడ పరిస్థితి వేరుగా ఉందని.. కొందరు సభ్యులు ఎవరికీ కనిపించకుండా వచ్చి హాజరు పుస్తకంలో సంతకాలు పెడుతున్నారన్నారు. దొంగల్లా వచ్చి సంతాకాలు పెట్టడం ఏంటని ఆయన ప్రశ్నించారు. గౌరవ సభ్యులు, ప్రజలతో ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలు.. దొంగల్లా వచ్చి సంతకాలు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని… ఎందుకింత కర్మ అంటూ అసహనం వ్యక్తం చేశారాయన. హాజరుపట్టిలో సంతకాలు చేసి.. సభకు రాకుండా ముఖం చాటేయడం ఆ సభ్యుల గౌరవాన్ని దిగజారుస్తుందని గుర్తుపెట్టుకోవాలన్నారు.
దొంగల్లా వచ్చి సంతకాలు చేసే వారిలో.. కొంత మంది తన దృష్టికి వచ్చారంటూ.. వారి పేర్లను సభలో చదవి వినిపించారు స్పీకర్. వై.బాలనాగిరెడ్డి, తాటిపర్తి చంద్రశేఖర్, రేగం మత్స్యలింగం, విరూపాక్షి, విశ్వేశ్వరరాజు, అమర్నాథరెడ్డి, దాసరి సుధ.. ఈ సభ్యులంతా సంతకాలు పెట్టి వెళ్తున్నారే గానీ.. సభకు రావడం లేదని తన దృష్టికి వచ్చిందన్నారు. ఫిబ్రవరి 24వ తేదీన వేరువేరు తేదీల్లో అటెండెన్స్ రిజిస్ట్రర్‌లో వారి సంతకాలు ఉన్నాయని… కానీ, సభలో మాత్రం వారు లేరన్నారు. ఎవరికీ కనిపించకుండా అంత దొంగచాటుగా వచ్చి.. దొంగల మాదిరిగా సంతకాలు పెట్టాల్సిన అవసరం లేదన్నారు. ఇలా చేయడం ఎంతవరకు సమంజసమో వాళ్లే ఆలోచించుకోవాలన్నారు. ఎన్నుకున్న ప్రజలకు ఆదర్శంగా నిలవాలే తప్ప… తలవొంపులు తేవొద్దన్నారు స్పీకర్.
ఇక… ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఐదు కీలక కమిటీల ఏర్పాటుకు స్పీకర్ ఆమోదం తెలిపారు. అయ్యన్నపాత్రుడు చైర్మన్గా నిబంధనల కమిటీ…. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు చైర్మన్‌గా వినతుల కమిటీ…. మాజీ మంత్రి పితాని సత్యనారాయణ చైర్మన్‌గా సభా హక్కుల కమిటీ….. మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ చైర్మన్‌గా నైతిక విలువ కమిటీని ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు.