మూత “బడి” తెరుచుకునేదెన్నడు…?

-నేటికీ కబ్జా కోరల్లోనే నర్సయగూడెం ప్రాథమిక పాఠశాల

-పాలకులు, అధికారులు స్పందిస్తారా.. వదిలేస్తారా..!

-అందుబాటులో కేంద్రం లేక పట్టణంలో నిర్వహణ

-పోలింగ్ కేంద్రం.. దూరా భారంతో 5వ వార్డు ప్రజల ఇబ్బందులు

-ఓటింగ్ పై ప్రభావం చూపే అవకాశం

క్రైమ్ మిర్రర్, నేరేడుచర్ల:- గతంలో ఉన్న ప్రాథమిక పాఠశాల నర్సయ్య గూడెం పోలింగ్ కేంద్రాన్నే మరల పునరుద్ధరించాలని నేరేడుచర్ల పురపాలిక పరిధిలోని నర్సయ్య గూడెం 5వ వార్డు సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. గతంలో 41 వ పోలింగ్ కేంద్రంగా ఉన్న పాఠశాల దారి కబ్జా కోరల్లో చిక్కుకొని అధికారులు, పాలకులు పట్టించుకోక పోవడంతో మెల్లమెల్లగా ముతపడ్డదని నర్సయ్య గూడెం వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్ కేంద్రం అందరికీ అందుబాటులో ఉంటే వృద్ధులు, గర్భిణీలు మహిళలు స్వేచయుతంగా ఓటు హక్కు వినియోగించుకొనే అవకాశం ఉంటుందని అధికారులు వెంటనే మూతబడ్డ పాఠశాలను తెరిపించాలని, పాఠశాలకు దారి కల్పించాలని కోరారు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఇబ్బందుల పాలుకావడం 5వ వార్డు వాసులకు సర్వసాధారణమైంది. ఎన్నికల ముందు నూతన పోలింగ్ కేంద్రం పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేస్తుండటంతో అక్కడ కొద్దిమంది మాత్రమే ఓటు హక్కును వినియోగించుకోవడం పరిపాటిగా మారింది. గతంలో ఎన్నికలు వచ్చిన ప్రతిసారి అందరూ ఓటర్లు కేంద్రం దగ్గర ఉండటంతో ఓటు శాతం ఎక్కువగా ఉండేది నేడు ఆయా పోలింగ్ బూత్లలో ఉండటం ద్వారా కనీసం వారి పోలింగ్ బూత్లు ఎక్కడ ఉన్నాయో తెలవకపోవడంతో భారీగా తగ్గే అవకాశం ఉంది ఓటు హక్కు వినియోగించుకోలేని పరిస్థితి ఏర్పడింది.

పోలింగ్ శాతంపై ప్రభావం :- దూరంగా ఉన్న పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేయాలంటే పలువురు అనాసక్తి చూపుతుండటంతో పోలింగ్ శాతంపై నేరుగా ప్రభావం పడుతోంది. ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులైతే ఇబ్బందికరంగా అనిపించినా ఇతరులపై ఆధారపడాల్సి వస్తోంది. కొన్ని సందర్భాల్లో తమ ఓటుహక్కును వినియోగించుకోలేని పరిస్థితులు ఉన్నాయి. అధికారులు ఓటర్లకు ఉన్న పలు సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎక్కువ సంఖ్యలో ఓటర్లున్న ఆవాస గ్రామాల్లో కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

మహిళలు, దివ్యాంగులు,వృద్ధులకు ఇబ్బందులు
నర్సయ్య గూడెం పరిధిలో చాలా మంది ఓటర్లు కూలీలు, వ్యవసాయ కుటుంబాలకు చెందిన వారే ఉంటారు. సొంత వాహనాలు లేని పరిస్థితి. రాజకీయ పార్టీల నేతలు వాహనాలు ఏర్పాటు చేస్తే నిబంధనలకు విరుద్ధం. అందుకే అధికారులు సమస్యను గుర్తించడమో, ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించడమో చేయాలని పలువురు కోరుతున్నారు. యువకులు ఎంత దూరమైనా వెళ్లి ఓటెయ్యడానికి ముందుకు వచ్చే అవకాశం ఉన్నా.. మహిళలు, వృద్ధు దివ్యాంగుల పరిస్థితి ఏమిటని పలువురు పేర్కొంటున్నారు. ఇకనైనా అధికారులు దృష్టి సారించాలని సూచిస్తున్నారు.

నర్సయ్య గూడెం పాఠశాల భవనంలో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలి

నర్సయ్య గూడెం ప్రాథమిక పాఠశాల భవనంలో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేసినట్లయితే ఈ కాలనీవాసులు వందకు వంద శాతం తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వెసులుబాటు కలుగుతుంది. సుమారు 1000 మంది జనాభా ఉన్న 5 వ వార్డుకు స్థానికంగా కేంద్రం పాఠశాల భవనంలో ఏర్పాటు చేస్తే బాగుంటుందని కాలనీవాసులు సంబంధిత అధికారులను వేడుకుంటున్నారు. లేనియెడల ఎన్నికల రోజున ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధులు వారి సొంత వాహనాలలో ఓటర్లను ప్రలోభ పెట్టి పోలింగ్ కేంద్రాలకు తీసుకువెళ్లే పరిస్థితి ఏర్పడుతుందని, దీంతో స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉండదని 5 వ వార్డు ప్రజలు వాపోతున్నారు.

బడి చుట్టూ పిచ్చి మొక్కలే..

నేరేడుచర్ల మండల పరిధిలోని 5వ వార్డు నర్సయ గూడెం ప్రాథమిక పాఠశాల ఐదేళ్ల కిందట మూతపడింది. ఒకప్పుడు ఈ పాఠశాలలో వందల మంది విద్యార్ధులు విద్యను అభ్యసించి ప్రస్తుతం వివిధ హోదాల్లో ఉన్నారు. విద్యార్ధుల సంఖ్య తగ్గడం దారి కబ్జాతో తల్లిదండ్రులు పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపించడం ప్రారంభించడంతో వారి సంఖ్య తగ్గుతూ వచ్చింది. విద్యార్థులు లేక భవనం నిరుపయోగంగా మారి చుట్టూ పిచ్చి మొక్కలు మొలిచి అడవిని తలపిస్తోంది.

అంగన్వాడీ కేంద్రంగా మార్చాలి

ప్రభుత్వ నిర్ణయం ప్రకారం విద్యార్థులు లేరనే కారణంతో
మూసివేసిన పాఠశాలలను తిరిగి ప్రారంభించి, విద్యా సంవత్సరం ప్రారంభంలోనే వాటిని సిద్ధం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ నేటికి అమలుకు నోచుకోలేదు.కొన్ని చోట్ల విద్యార్థులు లేని
పాఠశాలల భవనాలను అంగన్వాడీ కేంద్రాలుగా మారుస్తున్నారు. కనీసం భవనాన్ని అంగన్వాడీ కేంద్రంగా మార్చాలని స్థానికులు వేడుకుంటున్నారు

కన్నెత్తి చూడని అధికారులు

గతంలో వివిధ పత్రికలో బడికి దారి కల్పించి పాఠశాలను పునరుద్ధరించాలని పదేపదే ప్రచురించినా, స్థానికులు అధికారులకు విన్నవించినా నేటికి అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం శోచనీయం. ఒకటి రెండు సార్లు అధికారులు వచ్చినా నేటికి పరిష్కారం శూన్యం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button