Monday, March 23, 2026
Homeఅంతర్జాతీయంIndia–US Trade Deal: భారత్‌-అమెరికా వాణిజ్య ఒప్పందం ఖరారు, సుంకాలు తగ్గిస్తున్నట్లు ట్రంప్ ప్రకటన!

India–US Trade Deal: భారత్‌-అమెరికా వాణిజ్య ఒప్పందం ఖరారు, సుంకాలు తగ్గిస్తున్నట్లు ట్రంప్ ప్రకటన!

India-US Trade Update: భారత్‌తో అమెరికా వాణిజ్య ఒప్పందం కుదిరింది. భారత్‌పై ప్రతీకార సుంకాలను 25శాతం నుంచి 18శాతానికి తగ్గిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. ఒప్పందం వెంటనే అమల్లోకి వస్తుందని ట్రూత్‌ సోషల్‌ వేదికగా వెల్లడించారు. బదులుగా రష్యా చమురు కొనుగోళ్లు ఆపేస్తామని, అమెరికా చమురు ఉత్పత్తులను భారీగా కొనుగోలు చేస్తామని ప్రధాని మోడీ చెప్పారని వెల్లడించారు. అమెరికా ఉత్పత్తులపై భారత్‌ వసూలు చేస్తున్న టారిఫ్ లను దశలవారీగా సున్నాకు తగ్గిస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. రష్యా చమురు కొనుగోలు చేస్తోందంటూ భారత్‌పై వేసిన అదనపు 25శాతం సుంకాల అంశాన్ని ట్రంప్‌ ప్రస్తావించలేదు. కానీ భారత్‌లోని అమెరికా రాయబారి సెర్గియో గోర్‌ సోమవారం రాత్రి  కీలక విషయాలు వెల్లడించారు. భారత్‌పై సుంకాలను 50 శాతం నుంచి 18శాతానికి తగ్గించినట్టుగా వెల్లడించారు.

హర్షం వ్యక్తం చేసిన ప్రధాని మోడీ

మరోవైపు సుంకాల తగ్గింపుపై ప్రధాని మోడీ హర్షం వ్యక్తం చేశారు. 18 శాతానికి సుంకాలను తగ్గించడంపై ట్రంప్‌కు 140 కోట్ల మంది భారతీయుల తరఫున కృతజ్ఞతలు చెబుతున్నట్టు ప్రకటించారు. అయితే, రష్యా చమురు కొనుగోళ్ల నిలిపివేత తదితర అంశాలు వేటినీ మోడీ ప్రస్తావించలేదు. అమెరికా ఉత్పత్తుల దిగుమతులపై భారత్‌ భారీగా సుంకాలు విధిస్తోందంటూ గతేడాది జూలైలో 25శాతం ప్రతీకార సుంకాలు విధించిన ట్రంప్‌.. తర్వాత రష్యా నుంచి వద్దన్న చమురు కొంటోందంటూ ఆగస్టులో సుంకాలను 50 శాతానికి పెంచారు.

సుంకాల పెంపుపై మోడీ వ్యూహాత్మక మౌనం

అటు అమెరికా సుంకాల పెంపు నిర్ణయంపై ప్రధాని మోడీ ఎలాంటి ప్రకటన చేయలేదు. వ్యూహాత్మక మౌనం పాటించారు. ఇతర దేశాలు ట్రంప్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినా, మోడీ సైలెంట్ గా ఉన్నారు. యూరోపియన్ యూనియన్ తో అతిపెద్ద డీల్ కుదుర్చుకున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా వెనక్కి తగ్గక తప్పలేదు. తాజాగా డీల్ కు ట్రంప్ ఓకే చేశారు. సుంకాలు తగ్గించారు.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను.2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను.ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments